: సినిమా విడుదల సమయంలో మెగా ఫ్యాన్స్ తో ఈ తంటాలేల?


మెగా హీరో సినిమా రిలీజ్ అవుతుంటే చాలు... థియేటర్ల యజమానులకు తలనొప్పి మొదలవుతుంది. టికెట్ల కోసం వారు చేసే ప్రయత్నాలు, ఒక్కోసారి విధ్వంసకాండకు దారితీస్తాయి. ఫర్నీచర్ ధ్వంసమవుతుంది. మరో మూడు రోజుల్లో పవన్ కల్యాణ్ హీరోగా నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం విడుదల కానున్న వేళ, మరోసారి థియేటర్ల యజమానులు ఆందోళన పడుతున్నారు. మెగాభిమానులతో తమకు తిప్పలు తప్పడం లేదని, కేవలం ఫ్యాన్స్ కోసం ఓ రెండు థియేటర్లు కేటాయిస్తేనే కొంత ఫలితం ఉంటుందని శ్రీకాకుళం పట్టణంలోని సరస్వతి థియేటర్ మేనేజర్ చినరాజు అభిప్రాయపడ్డారు. అభిమానుల ఒత్తిడితో వారికే సింహభాగం టికెట్లు ఇచ్చి, సాధారణ ప్రేక్షకులకు ఇవ్వలేకపోతున్నామని తెలిపారు. మరోవైపు ఫ్యాన్స్ సైతం, హీరోల బొమ్మలతో లెటర్ హెడ్స్ తయారుచేయించుకుని, తమకు ఎన్ని టికెట్లు కావాలో తెలుపుతూ లేఖలను థియేటర్లకు ఇచ్చి టికెట్లను డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రధాన థియేటర్ల టికెట్లన్నీ జస్ట్ టికెట్స్, బుక్ మైషో వంటి వెబ్ సైట్లు, యాప్స్ ద్వారా అందుబాటులో ఉండగా, ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకులు వాటిని ఏకమొత్తంలో బుక్ చేసుకుని బ్లాక్ లో అమ్ముతున్నారన్న వాదనా వినిపిస్తోంది. ఇదిలావుండగా, హైదరాబాద్ లో శుక్రవారం నాటికి 'సర్దార్ గబ్బర్ సింగ్' టికెట్లన్నీ 99 శాతం వరకూ అమ్ముడైపోయాయి. ఒకటి రెండు థియేటర్లలో టికెట్లున్నా, ముందు వరుసలో ఒకటో, రెండో కనిపిస్తున్నాయి. ప్రసాద్స్, ఐనాక్స్ వంటి మల్టీప్లెక్స్ లలో టికెట్లను నేటి నుంచి అందుబాటులో ఉంచనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News