: జగన్ కేసు విచారణకు మరో బ్రేక్!... ఐఏఎస్ శ్యాంబాబు విచారణకూ కేంద్రం నో!


వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాఖలైన అక్రమాస్తుల కేసు విచారణకు మరో బ్రేక్ పడింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యాంబాబు (వైఎస్ హయాంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి) విచారణకు కేంద్రం ససేమిరా అంది. ఈ మేరకు శ్యాంబాబును దర్యాప్తు సంస్థలు విచారించేందుకు అనుమతించాలంటూ ఏపీ సర్కారు చేసిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. వివరాల్లోకెళితే... దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా అనంతపురం జిల్లాలో 8,841 ఎకరాలను లేపాక్షి నాలెడ్జ్ హబ్ కు ప్రభుత్వం కేటాయించింది. వైఎస్ సర్కారు చేసిన మేళ్లకు లేపాక్షి యాజమాన్యం జగన్ కంపెనీల్లో అక్రమంగా పెట్టుబడులు పెట్టిందని సీబీఐ తన దర్యాప్తులో తేల్చింది. ఈ మేరకు నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో సీబీఐ అధికారులు చార్జిషీటు కూడా దాఖలు చేశారు. ఇందులో నాటి పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ అధికారి శ్యాంబాబు కీలకంగా వ్యవహరించారని ఆరోపించిన సీబీఐ... ఆయనను విచారించేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరింది. శ్యాంబాబు ఐఏఎస్ అధికారి కావడంతో ఆయన ప్రాసిక్యూషన్ కు కేంద్రం అనుమతి కావాల్సి ఉంది. ఈ మేరకు ఏపీ సర్కారు కేంద్రానికి లేఖ రాసింది. అయితే నాడు వైఎస్ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తనకు పంపారని, దానిపై తాను జీవో మాత్రమే జారీ చేశానని శ్యాంబాబు కేంద్రానికి తెలిపారు. అంతేకాక జీవో జారీ చేయడం మినహా తనకే పాపం కూడా తెలియదని ఆయన వివరించారు. శ్యాంబాబు వాదనతో ఏకీభవించిన కేంద్రం... ఈ కేసులో శ్యాంబాబును విచారించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించింది.

  • Loading...

More Telugu News