: వివాదాస్ప‌ద వ్యాఖ్యల పర్యవసానం.. విస్కన్సిన్‌లో ట్రంప్ ఓటమి ఖాయ‌మంటున్న విశ్లేషకులు


అమెరికా అధ్యక్ష పదవి రేసులో తీవ్ర‌ పోటీనిస్తున్న‌ రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ ఇన్నాళ్లూ చేసిన సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌లు, వివాదాస్ప‌ద వ్యాఖ్యలు ఆయనకు నష్టం కలిగించేలా కనిపిస్తున్నాయి. మంగళవారం విస్కన్సిన్‌లో జరిగే ప్రైమరీలో ఆయన ఓటమి ఖాయమని పోల్స్ చెబుతున్నాయి. ఇక్కడ పార్టీలో ఆయన సమీప ప్రత్యర్థి టెడ్ క్రుజ్ విజయం సాధిస్తారని అంచనా వేస్తున్నాయి. ట్రంప్ కు అణకువ, మర్యాద లేవ‌ని విస్కన్సిన్ వాసులు మండిపడుతున్నారు. ఈ రాష్ట్రంలో మొత్తం 42 మంది డెలిగేట్లలో మెజారిటీ క్రుజ్ వర్గీయులే గెలుస్తారని భావిస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా నామినేషన్ లభించాలంటే మొత్తం మీద 1,237 మంది డెలిగేట్ల మద్దతు ఉండాలి. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ 736 మంది డెలిగేట్లతో ప్రథమ స్థానంలో ఉన్నారు. క్రుజ్‌కు ప్రస్తుతం 463 మంది డెలిగేట్లు మద్దతిస్తున్నారు. విస్కన్సిన్ లో గవర్నర్ స్కాట్ వాకర్‌పై ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలే ట్రంప్‌కు గుదిబండగా మారాయని విశ్లేషకులు చెబుతున్నారు. వాకర్‌కు రాష్ట్రంలో మంచి పేరు ఉందని, ఆయనపై ట్రంప్ చేస్తున్న వ్యంగ్యాస్త్రాల పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. ఇటీవ‌లే విస్కన్సిన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో క్రిస్ మాథ్యూతో చర్చ సందర్భంగా ట్రంప్ ప‌లు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి ఆ తర్వాత కాస్త వెన‌క్కి త‌గ్గారు. అబార్షన్లు చేయించుకునే మహిళలకు శిక్ష విధించాలన్నారు. అబార్షన్‌లు పరిపాటిగా మారుతున్నాయని, వాటిని నియంత్రించాలంటే ఆ మహిళలకు ఎంతో కొంత శిక్ష పడాలని ఆయన అన్నారు. అయితే ఏ శిక్ష వేయాలన్న విషయంపై మాత్రం ఆయన ఎలాంటి స్పష్టమైన ప్రకటనా చేయలేదు. గర్భస్రావాలను నిషేధించాలని కోరారు. 'అబార్షన్లను మీరు పూర్తిగా రద్దు చేయాలని అనుకుంటున్నారా?' అని అడిగిన ప్రశ్నకు ఆయన అలా స్పందించారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరూ గమనించాలని, వాటిని తలచుకుంటేనే భయంకరంగా, అసహ్యంగా ఉన్నాయని హిల్లరీ మండిపడ్డారు. దీంతో గర్భస్రావానికి పాల్పడే మహిళలను శిక్షించాలని వ్యాఖ్యలు చేసిన డొనాల్డ్ ట్రంప్ మాట మార్చారు. నలుమూలల నుంచీ విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన వెనక్కి తగ్గారు. "ముందు ట్రంప్ గెలవాలి. ఆపై ఎన్నో సమస్యలు ట్రంప్ ముందుకు వస్తాయని తెలుసు. వాటిని ఎలా పరిష్కరించాలో కూడా తెలుసు. గుడ్లను పగులగొడితేనే ఆకలి తీర్చుకోగలం. కొన్ని గుడ్లు ఇప్పటికే పగిలాయి. మరికొన్ని ఉన్నాయి" అని రిపబ్లికన్ల తరఫున పోటీలో మిగిలిన టెడ్ క్రుజ్‌, కాసిచ్ లను ఉద్దేశించి పేర్లు ప్రస్తావించకుండా డొనాల్డ్ ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News