: తప్పించుకుంటున్న బ్యాంకులను ఇరికిస్తున్న ఆర్బీఐ!


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను తగ్గిస్తూ వచ్చినప్పటికీ, ఆ ప్రయోజనాలను కస్టమర్లకు దక్కనీయకుండా చేస్తున్న బ్యాంకులను దారికి తెచ్చేందుకు రఘురాం రాజన్ కొత్త ప్లాన్ వేశారు. దేశంలో పెట్రోలు, క్రూడాయిల్ తదితర ధరలు సవరిస్తున్నట్టుగానే, బ్యాంకులు ఇకపై నెలకోసారి సవరించాలన్న ఆదేశాలు జారీ కానున్నాయని తెలుస్తోంది. ఫిక్సెడ్ డిపాజిట్ రేట్లు, స్వల్పకాల వడ్డీ రేట్లను నెలకోసారి ఆర్బీఐ రెపో రేటు ఆధారంగా మార్పులు చేర్పులు చేయడం తప్పనిసరి చేస్తూ నేడో, రేపో ఆదేశాలు వెలువడనున్నాయని తెలుస్తోంది. గత ఏడాది వ్యవధిలో ఆర్బీఐ 125 బేసిస్ పాయింట్లు (1.25 శాతం) వరకూ రెపో రేటును తగ్గించగా, బ్యాంకులు గరిష్ఠంగా 60 బేసిస్ పాయింట్ల వరకూ మాత్రమే వడ్డీ రేట్లను తగ్గించాయి. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న రాజన్ గతంలోనే బ్యాంకులకు తలంటారు. తమకు అందే ప్రయోజనాలను కస్టమర్లకు దగ్గర చేయడంలో విఫలమవుతున్నాయని జైట్లీ సైతం ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇక రేపు మరోసారి ఆర్బీఐ పరపతి సమీక్ష ఉండటం, ఈ దఫా పావు నుంచి అర శాతం వరకూ వడ్డీ రేటు తగ్గవచ్చన్న అంచనాల నేపథ్యంలో, వెంటనే ఆ ప్రయోజనం ప్రజలకు దగ్గర కావాలంటే బ్యాంకులు వడ్డీ రేట్లను సవరించాల్సి వుంటుంది. ఇక నెలవారీ వడ్డీ సవరింపుల నిర్ణయాన్ని ఆర్బీఐ అధికారికంగా వెలువరించిన పక్షంలో వడ్డీ తగ్గింపు ప్రయోజనాలను ప్రజల దరికి చేర్చకుండా తప్పించుకు తిరుగుతున్న బ్యాంకులు ఇరుక్కున్నట్టేనని నిపుణులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News