: విండీస్ ఆటగాడు సామ్యూల్స్‌కు ఐసీసీ భారీ జరిమానా
ఈడెన్ గార్డెన్ స్టేడియంలో జరిగిన వరల్డ్‌కప్ టీ 20 ఫైనల్ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇంగ్లండ్ బౌలర్లపై తిట్లవర్షం కురిపించిన విండీస్ ఆటగాడు మార్లన్ సామ్యూల్స్‌కు ఐసీసీ.. మ్యాచ్ ఫీజులో 30శాతం జరిమానా విధించింది. చివరి ఓవర్ వేసిన బెన్ స్టోక్‌పై మార్లన్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అతడిని ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడాడు. ఇంగ్లండ్ బౌలర్లపై సామ్యూల్స్ అసభ్య వ్యాఖ్యలు చేసినట్టు మొదట ఫీల్డ్ అంపైర్లు కుమార్ ధర్మసేన, రాడ్ టకర్, థర్డ్ అంపైర్ మారైఎస్ ఎరాస్మస్, ఫోర్త్ అంపైర్ బ్రుస్ ఆక్సెన్‌ఫర్డ్ అభియోగాలు మోపారు. దీంతో మార్లన్ సామ్యూల్స్ మ్యాచ్ ఫీజులో భారీ కోత తప్పలేదు. మరోవైపు ఫైనల్ పోరులో అద్భుత విజయం సాధించిన తరువాత కెప్టెన్ డరెన్ సామీ చేసిన వ్యాఖ్యలపై వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మండిపడింది. పోటీలో గెలిచినంత మాత్రాన అవాకులు, చవాకులు మాట్లాడటం సరికాదని హితవు పలికింది. తమ దేశపు క్రికెట్ బోర్డు తమకు ఎంతమాత్రం గౌరవం ఇవ్వలేదని, సరైన దుస్తులు లేవని, ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఇండియాకు వచ్చామని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఘనవిజయం సొంతం చేసుకున్నా.. ఇలాంటి వ్యాఖ్యలతో విండీస్ ఆటగాళ్లు విమర్శల పాలవుతున్నారు.