: ఆ ట్వీట్ బాధించి ఉంటే నన్ను క్షమించండి: క్రైస్తవులకు హృతిక్ రోషన్ విజ్ఞప్తి
క్రైస్తవమతాధిపతి పోప్ ఫ్రాన్సిస్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో ఇటీవలే బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ లీగల్ నోటీసులు అందుకున్న విషయం తెలిసిందే. ఆ నోటీసుల్లో ట్విట్టర్ లో పోప్ ఫ్రాన్సిస్ పై చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని హృతిక్ రోషన్ కు క్రిస్టియన్ సెక్యులర్ ఫోరం లీగల్ నోటీసు పంపింది. ఈ నేపథ్యంలో హృతిక్ రోషన్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. పోప్ పై తాను చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని, తాను చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. తన మాజీ లవర్, నటి కంగనారనౌత్ వ్యవహారంపై హృతిక్ రోషన్ స్పందిస్తూ తనకు 'పోప్‌తో డేటింగ్ వెళ్లే ఛాన్స్ ఉంటుందేమో, కానీ ఆమెతో ఉండద'ని ట్విట్టర్ వేదికగా కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. కంగనా రనౌత్ తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ హృతిక్.. తన ట్వీట్‌లో పోప్ పేరును ఈ విధంగా ప్రస్తావించాడు. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తన మాజీ ప్రియురాలు కంగనా రనౌత్ తో బ్రేకప్ అయి.. ఆమె నుంచి లీగల్ నోటీసులు అందుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ చిక్కులోంచి బయటపడక ముందే హృతిక్ రోషన్ పోప్‌పై కామెంట్లు చేసిన వివాదంలో చిక్కుకున్నాడు. తమ మతాధిపతిని అవమానించడం ద్వారా క్రైస్తవుల మనోభావాలను, విశ్వాసాలను ఆయన దెబ్బతీశారని పేర్కొంటూ 295ఏ సెక్షన్ కింద నోటీసులిచ్చింది.