: ముందుంది అమెరికాకు పెను కష్టాల కాలం: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికాలో ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉందని, దేశం అతిపెద్ద మాంద్యం దిశగా వేగంగా పడిపోతోందని, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అత్యంత క్లిష్టపరిస్థితి ఎదురుకానుందని రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష పదవికి పోటీ పడతారని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, ఈ విషయాలు వాల్ స్ట్రీట్ లోని ట్రేడర్లకు కూడా తెలుసుననే అనుకుంటున్నట్టు తెలిపారు. సమీప భవిష్యత్తులో అమెరికా తీవ్రమైన కష్టాలను ఎదుర్కోవాల్సి వుందని చెప్పారు. ప్రచారంలో తాను దూకుడుగానే వెళతానని, అదే తన బలమని చెప్పిన ట్రంప్, ఒంటరిగా వెళ్లి అధ్యక్ష పీఠాన్ని చేపడతానన్న నమ్మకముందని అన్నారు. అమెరికా 19 ట్రిలియన్ డాలర్ల రుణాలను పలు దేశాలకు, సంస్థలకు ఇవ్వాల్సి వుందని గుర్తు చేస్తూ, వచ్చే ఎనిమిదేళ్లలో అప్పంతా తీర్చడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. "ముందు ట్రంప్ గెలవాలి. ఆపై ఎన్నో సమస్యలు ట్రంప్ ముందుకు వస్తాయని తెలుసు. వాటిని ఎలా పరిష్కరించాలో కూడా తెలుసు. గుడ్లను పగులగొడితేనే ఆకలి తీర్చుకోగలం. కొన్ని గుడ్లు ఇప్పటికే పగిలాయి. మరికొన్ని ఉన్నాయి" అని రిపబ్లికన్ల తరఫున పోటీలో మిగిలిన టెడ్ క్రూజ్, కాసిచ్ లను ఉద్దేశించి పేర్లు ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు.