: రంగేసి, పేరు మార్చి... ఆర్టీసీ కొత్త వడ్డింపు!


ఏపీఎస్ ఆర్టీసీ మరోసారి చార్జీలను పెంచింది. అయితే ఈ దఫా అన్ని రకాల సర్వీసుల్లో కాదు సుమా! ఇప్పటికే నడుస్తున్న డీలక్స్ బస్సులకు స్వల్ప మార్పులు చేసి, కొత్త రంగులేసి 'అల్ట్రా డీలక్స్'గా పేరు పెట్టి చార్జీలను 10 శాతం పెంచేసింది. ఇంతకీ ఈ బస్సుకు చేసిన మార్పేమిటో తెలుసా? సీట్లు ఓ నాలుగు అంగుళాలు వెనక్కు వంగుతాయి. సూపర్ లగ్జరీ బస్సుల్లో సీటు 10 అంగుళాల వరకూ వెనక్కు వెళుతుందన్న సంగతి తెలిసిందే. కాసేపు నిద్రపోవడానికి ఈ పుష్ బ్యాక్ అనుకూలంగా ఉంటుంది. ఇక డీలక్స్ బస్సుల్లో సీట్లు వెనక్కు వెళ్లవు. అదనపు ఆదాయంపై కన్నేసిన ఆర్టీసీ యాజమాన్యం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 650 డీలక్స్ బస్సుల్లో ఇప్పటికే 200 బస్సులను అల్ట్రా డీలక్స్ లుగా మార్చేసింది. కేవలం నాలుగు అంగుళాల మేరకు సీట్లు జరిగినంత మాత్రాన పెద్దగా సౌకర్యం ఉండదని, దానికే 10 శాతం చార్జీలు పెంచడం ఏంటని ప్రయాణికులు విమర్శిస్తున్నారు. కాగా, ప్రస్తుతం విజయవాడ నుంచి హైదరాబాద్ కు డీలక్స్ బస్ చార్జీ రూ. 332 కాగా, అల్ట్రా డీలక్స్ లో చార్జి రూ. 366గా ఉంటుంది. అదే విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్య చార్జీ రూ. 427 నుంచి రూ. 475కు, విజయవాడ నుంచి నెల్లూరు మధ్య చార్జీ రూ. 319 నుంచి రూ. 357కు పెరగనుంది. ఆర్టీసీ అధికారులు మాత్రం ఒక్కో బస్సులో సీట్ల మార్పునకు రూ. 25 వేలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News