: రూ.10.59 కోట్లు కొల్లగొట్టిన విండీస్ జట్టు... ఓడిన టీమిండియాకూ రూ.2.64 కోట్లు
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీ నిన్న రాత్రితో ముగిసింది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను టీవీ తెరలకు కట్టిపడేసిన ఈ పొట్టి ప్రపంచ కప్ విజేతగా వెస్టిండీస్ జట్టు నిలిచింది. టైటిల్ ఫేపరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా సెమీస్ వరకూ చేరినా... కరేబియన్ల చేతిలో మట్టి కరిచింది. నిన్న రాత్రి కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన టైటిల్ పోరులో విండీస్ జట్టు... ఇంగ్లండ్ జట్టుపై పైచేయి సాధించింది. అంతకుముందు మహిళల విభాగంలో జరిగిన ఫైనల్ లో ఆస్ట్రేలియా జట్టును చిత్తు చేసిన విండీస్ లేడీస్ టైటిల్ ను చేజిక్కించుకున్నారు. పోరు ముగిసిన నేపథ్యంలో టైటిల్ విన్నర్, రన్నర్ జట్లకు అందిన నజరానా ఎంతన్న విషయానికొస్తే... పురుషుల విభాగంలో విజేతగా నిలిచిన విండీస్ జట్టుకు ఏకంగా రూ.10.59 కోట్లు దక్కాయి. ఇక రన్నరప్ గా నిలిచిన ఇంగ్లండ్ జట్టు రూ.5.29 కోట్లు దక్కించుకుంది. సెమీస్ లోనే ఇంటిదారి పట్టిన టీమిండియాకు రూ.2.64 కోట్లు దక్కాయి. సెమీస్ లోనే పోరు ముగించిన న్యూజిల్యాండ్ కు కూడా ఇంతే మొత్తం లభించింది. ఇక మహిళ విభాగానికొస్తే... విన్నర్ గా నిలిచిన విండీస్ జట్టు రూ.66.23 లక్షలు, రన్నర్ స్థానంతో సరిపెట్టుకున్న ఆస్ట్రేలియా జట్టు రూ.33.11 లక్షలు దక్కించుకున్నాయి.