: విజయ్ మాల్యా ఆస్తుల గుట్టు వీడేనా?... పలు దేశాలకు ఈడీ లెటర్స్ రోగేటరీలు
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఆస్తుల గుట్టు విప్పేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. 17 బ్యాంకులకు దాదాపు రూ.9 వేల కోట్ల రుణాలను ఎగవేసి లండన్ చెక్కేసిన మాల్యా సంచలనం రేపారు. ఇప్పటికే ఆయనపై నమోదైన కేసులు, కోర్టుల్లో దాఖలైన పిటిషన్ల విచారణకు హాజరయ్యేందుకు ససేమిరా అంటున్న మాల్యాకు విదేశాల్లో భారీ ఎత్తున ఆస్తులున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఈ ఆస్తుల పూర్తి వివరాలు దర్యాప్తు సంస్థలకు తెలియడం లేదు. దీంతో ఆ ఆస్తుల గుట్టును విప్పేందుకు ఈడీ అధికారులు పలు దేశాలకు లెటర్స్ రోగేటరీలను జారీ చేశారు. మీ మీ దేశాల్లో విజయ్ మాల్యా, ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తుల వివరాలను అందజేయాలని ఈడీ... ఆ లేఖల్లో ఆయా దేశాలను కోరింది. ఈడీ లెటర్స్ రోగేటరీలు రాసిన దేశాల్లో... అమెరికా, బ్రిటన్, దక్షిణాఫ్రికా, హాంకాంగ్, ఫ్రాన్స్ దేశాలున్నాయి.