: యూపీలో దారుణం!...ఎన్ఐఏ అధికారిని కాల్చి చంపిన దుండగులు
ఉత్తరప్రదేశ్ లో మొన్న అర్ధరాత్రి దాటిన తర్వాత దారుణం చోటుచేసుకుంది. బంధువుల ఇంటిలో జరిగిన ఓ పెళ్లికి వెళ్లి భార్యా పిల్లలతో కలిసి ఇంటికి తిరిగివస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)కి చెందిన పోలీసు అధికారి తంజిల్ అహ్మద్ ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. యూపీలోని బిజ్నూర్ లో చోటుచేసుకున్న ఈ ఘటన నిన్న దేశవ్యాప్తంగా కలకలం రేపింది. కీలక కేసులు... ప్రత్యేకించి ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన కేసుల దర్యాప్తు కోసమే ఎన్ఐఏ ఏర్పాటైన సంగతి తెలిసిందే. అప్పటిదాకా సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)లో పనిచేస్తున్న అహ్మద్... ఎన్ఐఏ ఏర్పాటు తర్వాత ఆ సంస్థలో పనిచేసేందుకు డిప్యూటేషన్ పై వచ్చారు. ఢిల్లీలో నివాసముంటున్న అహ్మద్... తన సొంతూరులో జరుగుతున్న బంధువుల పెళ్లికి హాజరయ్యేందుకే బిజ్నూర్ జిల్లా సాహస్ పూర్ కు వచ్చారు. భార్యతో పాటు ఇద్దరు పిల్లలతో కలిసి పెళ్లికి హాజరైన ఆయన మొన్న రాత్రి 12.45 గంటల ప్రాంతంలో కారులో ఇంటికి తిరిగివస్తున్నారు. ఈ క్రమంలో బైక్ పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు అహ్మద్ కారుపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో దాదాపు 24 బుల్లెట్లు అహ్మద్ శరీరంలోకి దూసుకెళ్లాయి. దీంతో రక్తపు మడుగులో పడిపోయిన అహ్మద్ కారులోనే ప్రాణాలు వదిలారు. దాడిలో అహ్మద్ భార్య ఫర్జానా కూడా తీవ్ర గాయాలపాలయ్యారు. దేశంలో పలు ప్రాంతాల్లో విధ్వంసాలకు పాల్పడిన ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ కు చెందిన పలు కీలక కేసుల దర్యాప్తులో అహ్మద్ కీలక భూమిక పోషిస్తున్నారు.