: ‘జబర్దస్త్’ రోజా అంటూ ఎక్కువగా కామెంట్ చేస్తున్నారు: రోజా
‘‘జబర్దస్త్’ రోజా అని, ఇది ‘జబర్దస్త్’ అనుకుంటున్నావా? జడ్జి అనుకుంటున్నావా?’ అంటూ ఈ మధ్య ఎక్కువగా తనపై కామెంట్స్ చేస్తున్నారని ఎమ్మెల్యే రోజా అన్నారు. కేవలం తనపై అసూయతోనే ఇలా అంటున్నారని ఆమె అన్నారు. అసెంబ్లీని ఎలా నిర్వహించాలని స్పీకర్ అనుకుంటారో.. అదేవిధంగా ‘జబర్దస్త్’ను నిర్వహించాలని దాని డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా అనుకుంటున్నారని ఆమె చెప్పింది. అసెంబ్లీలో ప్రజా సమస్యల గురించి ప్రస్తావిస్తానని, ఆ షోలో మాత్రం జడ్జిగా పోటీదారులకు ఎన్ని మార్కులివ్వాలో తన చేతిలో ఉన్న బోర్డు ఎత్తి చూపిస్తానని చెప్పారు. అంతేకానీ, బూతులు మాట్లాడటం, తప్పుగా మాట్లాడటం అనేది షోలో ఉండదని, అది ఒక కామెడీ షో అని పేర్కొన్నారు. భార్యాభర్తలో, ఇద్దరు మగవాళ్లో, ఇద్దరు ఆడవాళ్లో, ఫ్రెండ్సో కలిసి కూర్చుని మాట్లాడుకునేటప్పుడు ఒకటి రెండు సరసమైన పదాలు సంభాషణలో వస్తాయని, అది పెద్ద తప్పేమీ కాదని రోజా సమర్థించుకున్నారు.