: గతంలో ప్రియాంకా చోప్రా ఆత్మహత్యకు ప్రయత్నించింది!: వెల్లడించిన మాజీ మేనేజర్
టీవీ స్టార్ ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యోదంతం తరువాత ఏర్పడిన షాక్ నుంచి తేరుకోని బాలీవుడ్ పరిశ్రమకు మరింత షాకిస్తూ, గతంలో ప్రియాంకా చోప్రా ఆత్మహత్యకు ప్రయత్నించారని చెప్పి, ఆమె మాజీ మేనేజర్ ప్రకాష్ జాజు సంచలన వ్యాఖ్యలు చేశాడు. సినిమా పరిశ్రమలో ఆమె కష్టాలను అనుభవిస్తున్న సమయంలో రెండు మూడు సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిందని, ఆ సమయంలో తాను ఆపగలిగానని చెప్పుకొచ్చాడు. ఆమెకు, ఆమె అప్పటి బాయ్ ఫ్రెండ్ అసీమ్ కు మధ్య గొడవలు జరుగుతుండేవని, వీటి కారణంగా ఆమె రాత్రుళ్లు పెద్దగా ఏడుస్తూ ఉండేదని చెప్పాడు. ఒకరోజు గొడవ తరువాత ఒంటరిగా ముంబై వాసై ప్రాంతానికి ఆత్మహత్య చేసుకునేందుకు వెళితే, తాను మనసు మార్చానని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించి కొత్త చర్చకు తెరదీశాడు. 2002లో తన తల్లి మరణం తరువాత ఆమె బిల్డింగ్ పై నుంచి దూకబోయిందని, ఆపై ఆమె ఫ్లాట్ కు గోడలు, కిటికీలు బిగించేంత వరకూ ఆమెను కుర్చీకి కట్టేశామని తెలిపాడు. ముంబైలో ఒంటరిగా ఉండే ఆడపిల్లలు మద్యం, డ్రగ్స్ కు బానిస కావడం సాధారణమని, వారిని ఆపేందుకు ఎవరూ ఉండరని ట్వీట్ చేశాడు. ప్రియాంకా చోప్రా ఇప్పుడు చాలా మానసిక దృఢత్వంతో కనిపిస్తోందని చెప్పుకొచ్చాడు. సినిమా, టీవీ పరిశ్రమలో పనిచేసే యువతులను వారి తల్లిదండ్రులు ఒంటరిగా ముంబై పంపవద్దని సలహా ఇచ్చాడు.