: మసీదుగా రూపాంతరం చెందిన ముంబై 'అలెగ్జాండ్రా' సినిమా హాల్
1921లో ప్రారంభమై ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ '39 స్టెప్స్' నుంచి 'బ్రూస్ లీ - ది లెజండ్' వరకూ వందలాది చిత్రాలను ప్రదర్శించిన ముంబైలోని 'అలెగ్జాండ్రా సినిమా' థియేటర్ లోని స్పీకర్ల నుంచి ఇప్పుడు రోజుకు ఐదుసార్లు నమాజ్ వినిపిస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక సాంకేతికతను అందుకోవడంలో వెనుకబడిన ఈ సినిమా హాల్ ను మసీద్ కమ్ ఇస్లామిక్ ఇనిస్టిట్యూషన్ గా మార్చడమే ఇందుకు కారణం! ఒకప్పుడు సూపర్ హిట్ చిత్రాలను వందల రోజుల పాటు ప్రదర్శించిన హాల్, 2000 సంవత్సరం వచ్చే సరికి ప్రాభవం కోల్పోగా, బీ, సీ గ్రేడ్ చిత్రాలను ప్రదర్శించడం ప్రారంభించారు. ఆ సమయంలో తమ పిల్లల స్కూల్ బస్ లను సైతం థియేటర్ ఉన్న దారిలోంచి తీసుకెళ్లవద్దని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తుండే వారంటే, ఆ హాల్ లో ఎలాంటి సినిమాలు ప్రదర్శించేవారో అర్థం చేసుకోవచ్చు. ఆపై 2011లో దక్షిణ ముంబైకి చెందిన బిల్డర్ రఫీక్ దూద్ వాలా, దాదాపు 15 వేల చదరపు అడుగుల్లో ఉన్న ఈ థియేటర్ ను కొనుగోలు చేసి 'దీనియత్' పేరిట సేవలందిస్తున్న ఇస్లామిక్ ఎన్జీవో సంస్థకు విరాళంగా అందించారు. ముంబై సెంట్రల్ పరిధిలోని నాగ్ పాద జంక్షన్ లో ఉన్న సినిమా హాల్, ఆపై ఇస్లాంను బోధించే మదారసాగా, మసీదుగా మారిపోయింది. ప్రస్తుతం బయటి నుంచి థియేటరుగానే కనిపిస్తున్నా, లోపల మొత్తం మసీదుకు అనుగుణంగా మార్చామని, చుట్టుపక్కల ప్రజలు కూడా, ఇక్కడ మసీదు ప్రారంభం కావడం పట్ల సంతోషంగా ఉన్నారని దీనియత్ ప్రతినిధి ఒకరు తెలిపారు.