: పాక్ లో రూ. 10 విరాళమిచ్చి విమర్శల పాలైన భారత దౌత్యాధికారి
అంతర్జాతీయ స్థాయి దౌత్యాధికారులు పాల్గొన్న ఓ సభలో అతిథులందరూ స్వచ్ఛంద విరాళాలు ఇవ్వాలని కోరిన వేళ, భారత దౌత్యాధికారి గౌతమ్ బంబావాలే, రూ. 10 నోటు ఇచ్చి విమర్శల పాలయ్యారు. ఇస్లామాబాద్ లోని కెహ్ కేషన్ హాల్ లో ఈ ఘటన జరిగింది. పాక్ లోని ఆక్స్ ఫర్డ్ అండ్ కేంబ్రిడ్జ్ సొసైటీ ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, ఆఫ్గన్, పాక్ సంబంధాలపై పాక్ లో ఆఫ్గన్ అంబాసిడర్ ఒమర్ జకివాల్ ప్రసంగించాల్సి వుంది. ఈ కార్యక్రమానికి పలువురు అతిధులు హాజరయ్యారు. సొసైటీ చైర్మన్ ఇర్షాద్ - ఉల్లా ఖాన్, వేదికపై ఓ డ్రాప్ బాక్స్ పెట్టి, ప్రతి ఒక్క అతిథీ కనీసం రూ. 500కు తగ్గకుండా డొనేషన్ ఇవ్వాలని కోరారు. గౌతమ్ స్టేజ్ పైకి వెళ్లి, తన వాలెట్ నుంచి రూ. 10 నోటు తీసి అందులో వేశారు. ఆపై ఖాన్ మాట్లాడుతూ, "పది రూపాయలు ఇచ్చి కాశ్మీర్ అంశాన్ని పరిష్కరించాలని మీరెలా అనుకుంటున్నారు?" అని బహిరంగంగానే ప్రశ్నించారు. ఆయనను పలువురు ఇదే తరహాలో విమర్శించగా, ఆ సమయంలో తన వద్ద పది రూపాయల నోటు మాత్రమే ఉందని, దాన్నే చూపించి ఇచ్చానే తప్ప కించపరిచే ఉద్దేశం లేదని గౌతమ్ వ్యాఖ్యానించారు.