: ఆస్ట్రేలియాలో రూ. 52 వేల కోట్ల విలువైన ప్రాజెక్టు అనుమతులు పొందిన అదానీ
ఆస్ట్రేలియాలోని గాలిలీ క్షేత్రంలో 7.7 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 52 వేల కోట్లు) విలువైన బొగ్గు క్షేత్రాన్ని నిర్వహించేందుకు క్వీన్స్ ల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వం అదానీ ఎంటర్ ప్రైజస్ కు అనుమతులను మంజూరు చేసింది. ఈ విషయాన్ని క్వీన్స్ ల్యాండ్ ప్రీమియర్ అనస్తాసియా పలాస్ జుక్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇక్కడి బొగ్గు గనుల్లో 11 బిలియన్ టన్నుల నిక్షేపాలున్నాయని, ఈ ప్రాంతంలో రహదారులు, వర్క్ షాప్ లు, విద్యుత్ సదుపాయం నిమిత్తం లైన్లు, మంచినీటి పైప్ లైన్లు నిర్మించాల్సి వుందని అన్నారు. "పనులు పూర్తి స్థాయిలో ప్రారంభం కావాలంటే, మరికొన్ని అనుమతులు రావాల్సి వుంది. దీన్ని చేపట్టాలా? వద్దా? అన్న నిర్ణయం మాత్రం అదానీ సంస్థదే" అని ఆయన అన్నారు. ఆస్ట్రేలియాలో ప్రాజెక్టుపై వ్యాఖ్యానించేందుకు అదానీ సంస్థ ప్రతినిధులు అందుబాటులో లేరు. కాగా, ఈ ప్రాజెక్టు పర్యావరణానికి విఘాతం కలిగిస్తుందని ఆస్ట్రేలియాలో ఉద్యమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అన్ని అనుమతులూ వచ్చినా, గనుల అభివృద్ధికి అవసరమయ్యే నిధుల సమీకరణ కష్టం కాగలదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.