: కేసీఆర్ తప్పులపై మేమూ ప్రజెంటేషన్ ఇస్తాం... అనుమతించండి!: కాంగ్రెస్ డిమాండ్!
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అసెంబ్లీ వేదికగా కేసీఆర్ పచ్చి అబద్ధాలు చెప్పారని, ఆయన తప్పులను ఎత్తి చూపుతూ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు తమను కూడా అనుమతించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ప్రభుత్వం సభా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందునే తాము హాజరు కాలేదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్య నిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. భారీ ఎత్తున ప్రజాధనాన్ని దోచుకోవడానికే ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ చూపించినట్టుగానే, తాము కూడా అసెంబ్లీలో ప్రాజెక్టులపై నిజాలతో కూడిన చిత్రాన్ని చూపుతామని ఇప్పటికే స్పీకరుకు విజ్ఞప్తి చేసినట్టు వివరించారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉండికూడా, మాట్లాడేందుకు వీలులేని తాము సభకు వచ్చి మాత్రం ప్రయోజనం ఏంటని భట్టి ప్రశ్నించారు.