: లియోనార్డో డికాప్రియోకు దేశ బహిష్కరణ విధిస్తామని హెచ్చరించిన ఇండోనేసియా
ప్రముఖ హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియోను దేశబహిష్కరణ చేస్తామంటూ ఇండోనేసియా ప్రభుత్వం హెచ్చరించింది. ఆస్కార్ సాధించిన నటుడు డికాప్రియోకు సామాజిక చైతన్యం ఎక్కువ. ఆస్కార్ అవార్డు అందుకునేటప్పుడు కూడా, 'భూతాపం పెరిగిపోతోంది, నియంత్రణకు చర్యలు చేపట్టాలి. లేకపోతే భవిష్యత్ తరాలు తీవ్రపరిణామాలు ఎదుర్కొంటాయ'ని ఉద్బోధ చేసిన సంగతి తెలిసిందే. పర్యావరణ పరిరక్షణకు అంతలా పాటుపడతాడు. అలాంటి డికాప్రియో గత వారం ఇండోనేసియాలో పర్యటించాడు. అక్కడ పది లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్రఖ్యాత గునుంగ్ పార్క్ లో పామాయిల్ పెంపకానికి ఇండోనేసియా ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో లక్షలాది ఎకరాలను చదును చేస్తూ పామాయిల్ మొక్కలు పెంచుతున్నారు. దీంతో అక్కడ సంచరించే ఒరాంగుటాన్ మనుగడకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీనిపై ప్రకృతి ప్రేమికులు విరుచుకుపడుతున్నారు. వారితో డికాప్రియో గొంతు కలిపాడు. సోషల్ మీడియాలో ఇండోనేసియా ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు పెట్టాడు. దీంతో తమ దేశాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేసిన డికాప్రియోకు దేశ బహిష్కరణ విధిస్తామని హెచ్చరించింది. గతంలో ఇండియానా జోన్స్ నటుడు హారిసన్ ఫోర్డ్ ను కూడా ఇండోనేసియా ఇలాగే హెచ్చరించింది.