: మహారాష్ట్రలో ఐపీఎల్ నిర్వహించవద్దు... అసలే నీటి కొరతతో వున్నాం!: బీసీసీఐకి బీజేపీ నేత లేఖ


మహారాష్ట్రలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహించవద్దని బీజేపీ ముంబై ప్రధాన కార్యదర్శి వివేకానంద గుప్తే బీసీసీఐకి లేఖ రాశారు. మహారాష్ట్రలో నీటి లభ్యత లేని ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహిస్తే నీటి దుర్వినియోగం జరిగే అవకాశం ఉందని, అందుకే మహారాష్ట్రలో నిర్వహించాల్సిన ఐపీఎల్ మ్యాచ్ లను రద్దు చేయాలని ఆయన బీసీసీఐకి సూచించారు. కాగా, మహారాష్ట్రలోని ముంబై, పూణే, నాగ్ పూర్ స్టేడియంల వేదికగా మ్యాచ్ లు నిర్వహించనున్నారు. ఒక మ్యాచ్ కు మైదానం సిద్ధం చేసేందుకు 80,000 నుంచి లక్ష లీటర్ల నీరు అవసరమవుతుందని ఆయన చెప్పారు. ఇలా వారానికి కనీసం రెండు నుంచి మూడు సార్లు చేయాలని, అంటే సుమారు లక్షా 60 వేల లీటర్ల నుంచి మూడు లక్షల లీటర్ల నీరు అవసరమవుతుందని ఆయన పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో ఇంతనీటిని వృథా చేయడం అవసరమా? అని ఆయన బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ కు రాసిన లేఖలో ఆయన ప్రశ్నించారు. 90 లక్షల మంది రైతులపై నీటి కొరత తీవ్ర ప్రభావం చూపిందని, అలాంటి పరిస్థితుల్లో 70 లక్షల లీటర్ల నీటిని వృథా చేయాలా? అని ఆయన లేఖలో అడిగారు. కాగా, ఈ మూడు వేదికలపై 19 ఐపీఎల్ మ్యాచ్ లు జరగనున్నాయి. శశాంక్ మనోహర్ మరాఠా వ్యక్తి కావడం వల్ల ఇక్కడి రైతుల పరిస్థితులు తెలిసే ఉంటుందని, ఆయన అర్థం చేసుకుంటారని ఈ లేఖ రాస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News