: వందేమాతరం మన జాతీయ గీతం కావాలి: భయ్యాజీ జోషి
ప్రతీ భారతీయుడు 'భారత్ మాతాకీ జై' అని నినదించాలని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించడం, దానిపై పార్లమెంటు సహా దేశం నలువైపులా అనుకూల, వ్యతిరేక వ్యాఖ్యలు వినిపించడం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి అటువంటిదే మరో వ్యాఖ్య చేశారు. ముంబైలో దీన దయాళ్ ఉపాధ్యాయ రీచ్ సంస్థలో మాట్లాడుతూ.. అసలైన జాతీయగీతం జనగణమణ కాదని, వందేమాతరమే అసలైన జాతీయ గీతమని అన్నారు. ప్రస్తుతం జనగణమణ మన జాతీయ గీతమని, అందువల్ల దాన్ని గౌరవించాల్సిందేనని, అయితే సరైన అర్థం తీసుకుంటే వందేమాతరమే మన జాతీయ గీతం కావాలని ఆయన అన్నారు. అయితే రాజ్యాంగం ప్రకారం జనగణమణ ఉంది కాబట్టి దాన్నే మనం కూడా పరిగణనలోకి తీసుకుంటున్నామన్నారు. జనగణమణ ఎప్పుడో రాశారని, కానీ అందులో అప్పటి ప్రభుత్వాన్ని ఉద్దేశించి రాశారని భయ్యాజీ జోషి అన్నారు. వందేమాతరంలో మాత్రం దేశ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించారని పేర్కొన్నారు. ఈ రెండింటి మధ్య తేడా ఇదేనని, రెండింటినీ గౌరవించాల్సిందేనని ఆయన తెలిపారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ప్రధాన కార్యదర్శిగా సురేశ్ భయ్యాజీ జోషి(68) మూడోసారి ఎన్నికై సేవలు అందిస్తోన్న విషయం తెలిసిందే.