: టీమిండియా గెలుస్తుందని భావించాను...గేల్ అవుటయ్యాక అది నిజమే అనుకున్నా: షేన్ వార్న్


టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో టీమిండియా ఓటమిపాలవ్వడం నుంచి ఇంకా చాలామంది అభిమానులు తేరుకోలేదు. ఆ జాబితాలో ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ కూడా వున్నాడు. టీమిండియా ఓటమిపై షేన్ వార్న్ మాట్లాడుతూ, మ్యాచ్ ఆరంభానికి ముందు టీమిండియా గెలుస్తుందని భావించానని అన్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించడంతో ఇక టీమిండియాదే విజయం అనుకున్నానని ఆయన అన్నాడు. దీనికి తోడు గేల్ ను తొందరగా పెవిలియన్ చేర్చడంతో టీమిండియా విజయం సాధించిందని నిర్ధారించుకున్నానని వార్న్ పేర్కొన్నాడు. అయితే టీ20ల్లో ఏదయినా సాధ్యమని వెస్టిండీస్ నిరూపించిందని ఆయన తెలిపాడు. అద్భుతమైన ఆటతీరుతో విండీస్ పుంజుకుంటే...తప్పులతో టీమిండియా మ్యాచ్ చేజార్చుకుందని ఆయన అభిప్రాయపడ్డాడు. టీమిండియా ఓటమికి బౌలర్ల వైఫల్యానికి తోడు ఫీల్డింగ్ తప్పులు కూడా దోహదం చేశాయని చెప్పాడు. మూడో నంబర్ లో బ్యాటింగ్ కు కోహ్లీ అత్యుత్తమమైన బ్యాట్స్ మెన్ అని అన్నాడు. కోహ్లీ తిరుగులేని ఆటతీరును టోర్నీ ఆద్యంతం ప్రదర్శించాడని ఆయన కొనియాడాడు.

  • Loading...

More Telugu News