: మానవుడు మోయలేని భారాన్ని భగవంతుడు మోస్తాడు... త్వరలోనే తిరుమల వెళ్లి మొక్కు చెల్లిస్తా!: సీఎం కేసీఆర్
మానవుడు మోయలేని భారాన్ని భగవంతుడు మోస్తాడని, పవిత్ర సంఘనిర్మాణం కోసం ఆధ్యాత్మిక కేంద్రాలు కృషి చేస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్‌గుట్ట శ్రీవేంకటేశ్వరస్వామిని కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న సుదర్శనయాగంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరమాత్ముడిని ఏ రీతిలోనైనా పూజించవచ్చని అన్నారు. ఆలయ ఆవరణలో కల్యాణమండపం కోసం రూ.10 కోట్లు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. తన వ్యక్తిగతంగా మరో రూ. 10 లక్షల 116 విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. దేవాలయం చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూమిని స్వామివారికి చెందేలా చూస్తామని కేసీఆర్ అన్నారు. ఆలయ ప్రాంగణంలో కాటేజీలు కట్టిస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వస్తే తిరుమల శ్రీవారికి రూ. 5 కోట్లతో ఆభరణాలు తయారు చేసి సమర్పిస్తానని మొక్కుకున్నానని, త్వరలోనే తిరుమలను దర్శించుకుని మొక్కును చెల్లిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.