: వర్సిటీ ప్రయోగశాలలో శక్తిమంతమైన బాంబులను తయారుచేస్తున్న ఐఎస్ఐఎస్
ప్రపంచ వ్యాప్తంగా దాడులు జరుపుతూ ప్రజలను వణికిస్తోన్న ఇస్లామిక్ స్టేట్ గురించి మరో ఆందోళన కలిగించే విషయం బయటకొచ్చింది. రెండేళ్ల క్రితం ఇరాక్‌లోని మోసుల్ విశ్వవిద్యాలయాన్ని స్వాధీనం చేసుకున్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ ఆ వర్సిటీ రసాయనిక ప్రయోగశాలలో అత్యంత శక్తిమంతమైన బాంబులు తయారుచేస్తోందట. ఈ విషయంపై ఇరాక్ పేలుడు పదార్థాల విభాగం అత్యున్నత అధికారి జనరల్ హతెమ్ మాగ్సోసి మాట్లాడుతూ.. మోసుల్ విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే అత్యుత్తమ డాయీష్ పరిశోధన కేంద్రమని చెప్పారు. రసాయనిక ఆయుధాలు, పెరాక్సైడ్ ఆధారిత బాంబులు, ఆత్మాహుతి బెల్టులు వంటివాటి తయారీ కోసం ఈ ప్రయోగశాలను ఐఎస్ ఉపయోగించుకుంటోందని తెలిపారు. బెల్జియం, పారిస్ దాడుల్లో ఇటువంటి ఆయుధాలనే ఉపయోగించారన్నారు. అయితే అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు ఈ ప్రయోగాలని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఇటీవలే మోసుల్ విశ్వవిద్యాలయంపై వైమానిక దాడులు జరిగాయి. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రత్యర్థులకు తమ సత్తా ఏంటో తెలియజేయడానికి భయంకర దాడులు చేయడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. ప్రపంచ అరాచక శక్తిగా ఎదిగిన ఐఎస్ ఇంతకు ముందు తాను ఏలిన ప్రాంతాల మీద తిరిగి పట్టుకోసం ప్రయత్నిస్తోంది.