: శ్రీజ పెళ్లి సందడి వీడియో రిలీజ్... సంబరపడిపోతున్న చిరు ఫ్యాన్స్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రిగానే కాక టాలీవుడ్ లో మోగా స్టార్ గా ఓ వెలుగు వెలిగిన చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ వివాహం గత నెల 28న బెంగళూరులో అంగరంగ వైభవంగా జరిగింది. చిన్ననాటి స్నేహితుడు కల్యాణ్ తో శ్రీజ వివాహాన్ని మెగా ఫ్యామిలీ ఘనంగా నిర్వహించింది. బెంగళూరులోని తన సొంత ఫాం హౌస్ లో జరిగిన ఈ వేడుకకు అతి కొద్ది మంది మాత్రమే హాజరైనా, మొన్న హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్ లో ఇచ్చిన విందుకు చిరంజీవి ప్రముఖులందర్నీ ఆహ్వానించారు. సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులంతా ఈ విందుకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తాజాగా నేటి ఉదయం శ్రీజ పెళ్లి సందడికి సంబంధించిన ఓ వీడియోను మెగా ఫ్యామిలీ విడుదల చేసింది. శ్రీజను పెళ్లి కూతుర్ని చేసిన దగ్గర నుంచి పెళ్లి తంతు ముగిసేదాకా అన్ని కీలక ఘట్టాలతో రూపొందించిన ఈ వీడియో... మెగా అభిమానులను అలరిస్తోంది. తెలుగు న్యూస్ ఛానెళ్లలోనూ ఈ వీడియో ప్రముఖంగా ప్రసారమైంది. ఈ వీడియోలో చిరంజీవి చిన్న పిల్లాడిలా సందడి చేశారు. కూతురి పెళ్లి వేడుకలో సందడి చేసిన ఆయన పలువురితో కలిసి హుషారుగా స్టెప్పులేశారు.