: చంద్రబాబు ఫాంహౌస్ కు సర్కారీ నిధులు!...ఆర్ అండ్ బీ శాఖ తొలి కేటాయింపులు ఇవేనట
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కుటుంబానికి గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో రంగారెడ్డి జిల్లా మదీనాగూడలో ఓ ఫాంహౌస్ ఉంది. జూబ్లీహిల్స్ లోని తన సొంతింటిని కూల్చేసి, కొత్త ఇల్లు కట్టుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం చంద్రబాబు కుటుంబం ఈ ఫాంహౌస్ లోనే ఉంటోంది. ఈ ఫాంహౌస్ లో అదనపు హంగుల కోసం ఏపీ ప్రభుత్వం రూ.1.36 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులతో అత్యవసరంగా నామినేషన్ ప్రాతిపదికగా నిర్దేశిత పనులు చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖ నిన్న జీవో నెం.181ను జారీ చేసింది. ఈ ఫాంహౌస్ ను సీఎం క్యాంప్ ఆఫీస్ గా పేర్కొన్న ఆర్ అండ్ బీ శాఖ... భద్రత, ఇతర సౌకర్యాల కల్పనకే నిధులు విడుదల చేసినట్లు తెలిపింది. అంతేకాకుండా తన పద్దు కింద ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్ అండ్ బీ శాఖ చంద్రబాబు ఫాంహౌస్ కోసమే నిధులు విడుదల చేయడం గమనార్హం.