: టైం సరిపోలేదు!... రోజా పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా


వైసీపీ ఫైర్ బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా దాఖలు చేసిన పిటిషన్ పై నిన్న సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. ఈ మేరకు కోర్టు విచారణ చేపట్టనున్న పిటిషన్ల జాబితాలో రోజా పిటిషన్ కూడా ఉంది. ఈ క్రమంలో నిన్న రోజా ఢిల్లీలో వాలిపోయారు. తన పిటిషన్ పై జరగనున్న విచారణ కోసం ఆమె ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఆమె పిటిషన్ విచారణకు రాలేదు. ఎందుకని? వివరాల్లోకెళితే... తనపై ఏపీ అసెంబ్లీ విధించిన ఏడాది సస్పెన్షన్ ను రోజా సవాల్ చేశారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు సింగిల్ బెంచ్ లో ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చినా, డివిజన్ బెంచ్ షాకిచ్చింది. సింగిల్ బెంబ్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసిన డివిజన్ బెంచ్... రోజాపై విధించిన సస్పెన్షన్ సరైనదేనంటూ పరోక్షంగా వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో రోజా డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ గత నెల 29న సుప్రీంకోర్టు గడప తొక్కారు. రోజా పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు... నిన్న (ఏప్రిల్ 1)న విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది. జస్టిస్ గోపాల గౌడ, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన బెంచ్ ముందుకు ఈ పిటిషన్ చేరింది. నిన్న పలు పిటిషన్లను విచారించిన సుప్రీం ధర్మాసనం.. రోజా పిటిషన్ వద్దకు రాకముందే కోర్టు సమయం ముగిసింది. దీంతో ఈ పిటిషన్ ను సోమవారం విచారించనున్నట్లు న్యాయమూర్తులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News