: కేసీఆర్ అలా చేస్తే...అరగుండు కొట్టించుకుంటా!: నాగం జనార్దనరెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం 30 నెలల్లో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తే అరగుండు కొట్టించుకుంటానని బీజేపీ నేత నాగం జనార్దనరెడ్డి సవాలు విసిరారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సందర్భంగా శాసనసభలో కేసీఆర్ చెప్పిన మాట నిలబెట్టుకోవాలని ఆయన సూచించారు. కేసీఆర్ చేస్తున్న మోసాలు, చేస్తున్న తప్పులతో ప్రజల్లోకి వెళ్లి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానని ఆయన తెలిపారు. స్వార్థంతో కేసీఆర్ చేస్తున్న తప్పులకు ఆయన జైలుకు వెళ్లకతప్పదని ఆయన అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల అంచనాలు ఆరు నెలల్లోనే ఎందుకు రెట్టింపు అయ్యాయన్న విషయాన్ని ఆయన ప్రతిపక్షాలు, ప్రజలు, శాసనసభ్యులకు చెప్పి మెప్పించాలని సవాలు విసిరారు. ప్రాజెక్టుల అంచనాలు, టెండర్లు వంటి విషయాల్లో తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు నిజాయతీగా చెబితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన చెప్పారు. అలా చెప్పలేకపోతే కేసీఆర్ బహిరంగంగా లెంపలు వేసుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు.