: నేను రెడీ...బీసీసీఐ అడిగితే కనుక 'నో' చెప్పను: షేన్ వార్న్
టీమిండియాకు కోచ్ గా పని చేసే అవకాశం వస్తే పని చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ మనసులో మాట బయటపెట్టాడు. ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా, కోచ్ గా ఏకకాలంలో బాధ్యతలు నిర్వర్తించిన వార్న్... టీమిండియాతో పని చేయడాన్ని ఇష్టపడతానని అన్నాడు. వందకోట్ల మంది ప్రజల మద్దతు కలిగిన టీమిండియాపై సహజంగానే ఒత్తిడి ఉంటుందని చెప్పిన షేన్ వార్న్, టీమిండియా అద్భుతమైన జట్టని కొనియాడాడు. అలాంటి జట్టుకి కోచ్ గా పనిచేసే అవకాశం వస్తే తప్పకుండా అంగీకరిస్తానని అన్నాడు. తన జీవితంలో దేనికీ 'నో' చెప్పలేదని, రాజస్థాన్ కు కోచ్ గా పని చేశానని, క్రికెట్ తో అనుబంధం కొనసాగిస్తూ, కామెంటేటర్ గా కొనసాగుతున్నానని వార్న్ తెలిపాడు. కోచ్ గా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని వార్న్ తెలిపాడు. కాగా, ఇప్పటికే డైరెక్టర్ రవిశాస్త్రి పదవీకాలం ముగిసినా టీ20 వరల్డ్ కప్ ఉండడంతో అతని పదవీ కాలాన్ని బీసీసీఐ పొడిగించిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ సందడి పూర్తయితే, అతని పదవీకాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో వార్న్ వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.