: 'భారత్ మాతా కీ జై' అని పలకాల్సిన అవసరం లేదు: ఫత్వా జారీ చేసిన ముస్లిం సంస్థ


'భారత్ మాతా కీ జై' అని పలకాల్సిన అవసరం లేదని పేర్కొంటూ ఓ ముస్లిం మత సంస్థ ఫత్వా జారీ చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ ఇస్లామిక్ మత సంస్థ 'దారుల్ ఉలూమ్ దేవ్ బంద్' ఈ మేరకు ఓ ఫత్వా జారీ చేసింది. రెండు రోజులపాటు చర్చించిన ముస్లిం మత స్కాలర్లు నిర్ణయించిన మేరకు...తామంతా దేశాన్ని ప్రేమిస్తున్నామని స్పష్టం చేశారు. అయితే దేశమే తమ దేవుడు కాదని వారు తెలిపారు. హిందూ మతానికి, ఇస్లాం మతానికి వ్యత్యాసం ఉందని వారు పేర్కొన్నారు. హిందూ మతం విగ్రహారాధన చేస్తే, ఇస్లాం విగ్రహారాధనకు వ్యతిరేకమని వారు చెప్పారు. భారత్ మాత అనే దేవతను హిందువుల్లో ఒక వర్గం పూజిస్తుందని స్కాలర్లు అభిప్రాయపడ్డారు. ఇస్లాం నియమాల ప్రకారం దేవుడు ఒక్కడేనని, మరో దేవుడిని పూజించకూడదని వారు తెలిపారు. కాబట్టి 'భారత్ మాతా కీ జై' నినాదం చేయాల్సిన అవసరం లేదని ఫత్వా జారీ చేశామని వారు చెప్పారు. దేశపౌరులకు రాజ్యాంగం మతస్వేచ్ఛను ఇచ్చిందని, భారత రాజ్యాంగానికి లోబడి తాము ఫత్వా జారీ చేశామని వారు తెలిపారు. ప్రభుత్వాలు కానీ, సంస్థలు కానీ తమ భావజాలాన్ని చట్టానికి వ్యతిరేకంగా పౌరులమీద రుద్దడం సరికాదని ఇస్లామిక్ స్కాలర్లు స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలు 'భారత్ మాతా కీ జై' అంటేనే భారతీయులంటూ చేస్తున్న ప్రచారంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News