: సోషల్ మీడియాను హోరెత్తించిన ఆ పిల్లాడు అప్పుడలా... ఇప్పుడిలా వున్నాడు!
ఈ ఏడాది జనవరి 31న సోషల్ మీడియాలో పోస్టయిన ఓ ఫోటో నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంది. ఒంటినిండా టాటూలు కలిగిన ఓ పాశ్చాత్య దేశపు మహిళ ఎముకల గూడులా మారిన చిన్నారి బాలుడికి మినరల్ వాటర్ తాగిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో షేర్లు, లైకులు, కామెంట్లతో హోరెత్తించింది. ప్రపంచం మొత్తాన్ని స్పందింపజేసిన ఆ పిల్లాడిని మంత్రగత్తె పిల్లాడంటూ అతడి తల్లిదండ్రులు వదిలేశారు. దీంతో వీధుల్లోని చెత్తకుప్పల దగ్గర తిండి ఏరుకుంటూ చిక్కిశల్యమైన ఆ బాలుడుని నైజీరియా వీధిలోంచి నడిచి వెళ్తున్న డానిష్ సామాజిక కార్యకర్త అంజా రింగ్రెన్ లోవెన్ చేరదీశారు. సోషల్ మీడియాలో అతడి ఫోటో పెట్టి బాలుడి వైద్య ఖర్చులకు కొంత సాయం చేయాలని కోరగా, 68 లక్షల రూపాయల విరాళాలు అందాయి. దీంతో అతడికి 'హోప్' అని పేరుపెట్టి పెంచడం మొదలు పెట్టారు. రెండు నెలలు ముగియడంతో బాలుడిలో వచ్చిన మార్పు ప్రపంచానికి చాటేందుకు లోవెన్ గతంలో బాలుడితో దిగిన ఫోటో పక్కనే ప్రస్తుత ఫోటోను పోస్టు చేశారు. తాను చేరదీసినప్పుడు అనారోగ్యంతో ఉన్న 'హోప్' ను నెల రోజులపాటు ఆసుపత్రిలో ఉంచి రక్తమార్పిడి చేయించింది. అతని కడుపులో ఉన్న నులి పురుగులకు మందులు వాడారు. ప్రస్తుతం 'హోప్' చాలా ఆరోగ్యంగా ఆనందంగా పెరుగుతున్నాడు.