: 'ట్వీట్‌'కు రైల్వే శాఖ మ‌రోసారి స్పంద‌న‌.. 20 నిమిషాల్లో సాయం


ట్విట్టర్‌ ద్వారా సమస్య తెలియజేస్తే రైల్వే మంత్రిత్వ శాఖ తక్షణమే స్పందిస్తోంది. గ‌తంలో ఆకలిగా ఉన్నామంటూ విద్యార్థులు ట్వీట్‌ చేసిన గంటల్లోనే రైల్వే మంత్రి సురేష్ ప్రభు స్పందించిన సంగ‌తి తెలిసిందే. అంతేకాదు.. ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయిలను, ట్రైన్ లో దొంగతనం చేయాలనుకున్న దొంగ‌ల‌ను.. ప్రయాణికులు చేసిన ట్వీట్‌తో వెంట‌నే స్పందించి ప‌ట్టుకున్నారు రైల్వే పోలీసులు. తాజాగా, ట్వీట్‌తో అధికారులు 20 నిమిషాల్లోనే స్పందించిన మ‌రో సంఘ‌ట‌న‌ జరిగింది. ఢిల్లీ నుంచి వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్న రైలులో బిభుటి అనే ప్రయాణికుడి ఆరేళ్ల కుమారుడు పై బెర్త్‌ నుంచి కిందపడడంతో తలకు తీవ్రగాయమైంది. దీంతో బిభుటి రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు, రైల్వే మంత్రిత్వశాఖను ట్విట్టర్‌ ద్వారా సాయం కోరాడు. 20 నిమిషాల్లో రైల్వే మంత్రిత్వ శాఖ స్పందించి బిభుటి ఫోన్‌ నెంబరు తీసుకొని రైలు లూథియానా స్టేషన్‌కు రాగానే బాలుడికి వైద్య సహాయం అందించారు. దీంతో బిభుటి సురేశ్‌ ప్రభు, రైల్వే శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. ఒక్క ట్వీటుతో స్పందిస్తున్న రైల్వే శాఖ.. ప్ర‌యాణికుల నుంచి ప్ర‌శంస‌లు అందుకుంటోంది.

  • Loading...

More Telugu News