: ఆనందుడి స్థానంలో అశోకుడు!... ‘అప్పన్న’ ధర్మకర్తగా అశోక్ గజపతిరాజు
అభినవ ఆంధ్రభోజుడిగా పేరుగాంచిన విజయనగర రాజ వంశానికి చెందిన పూసపాటి ఆనంద గజపతిరాజు కన్నుమూసి నేటికి సరిగ్గా వారం రోజులవుతోంది. గత శనివారం విశాఖలోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే. చనిపోయేనాటికి సింహాచలం లక్ష్మీనరసింహ స్వామి ఆలయంతో పాటు రాష్ట్రంలోని వందకు పైగా ఆలయాలకు ఆయన అనువంశిక ధర్మకర్తగా ఉన్నారు. అయితే తన తదనంతర కాలంలో తన సోదరుడు, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ఆ బాధ్యతలను చేపట్టాలని ఆయన వీలునామా రాశారు. సదరు వీలునామాను పరిశీలించిన ఏపీ ప్రభుత్వం... ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హోదాలో ఉన్న అశోక్ గజపతిరాజును ఆనంద గజపతిరాజు స్థానంలో అప్పన్న ఆలయ ధర్మకర్తగా నియమిస్తూ నిన్న అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆనంద గజపతిరాజు ధర్మకర్తగా వ్యవహరించిన మిగిలిన ఆలయాలకు కూడా అశోక్ గజపతిరాజు ధర్మకర్తగా వ్యవహరిస్తారని సదరు ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో త్వరలోనే అశోక్ గజపతిరాజు సింహాచలం ఆలయ ధర్మకర్తగా బాధ్యతలు స్వీకరిస్తారు.