: మీడియా ప్రశ్నల వర్షం... ఉక్కిరిబిక్కిరి అయిన ఐవీఆర్సీఎల్ యాజమాన్యం
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో కుప్పకూలిన ఫ్లై ఓవర్ ఘటన హైదరాబాదులోని ఐవీఆర్సీఎల్ యాజమాన్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఫ్లై ఓవర్ నిర్మాణంలో సదరు కంపెనీ వ్యవహరించిన నిర్లక్ష్యం కారణంగానే పెను ప్రమాదం సంభవించిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చిన ఐవీఆర్సీఎల్ కంపెనీ యాజమాన్యం మీడియా సంధించిన ప్రశ్నల వర్షంలో తడిసిముద్దైంది. 25 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోవడమే కాక 60 మందిని ఆసుపత్రి పాల్జేసిన ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో బెంగాల్ పోలీసులు నేటి ఉదయానికే హైదరాబాదు చేరుకున్నారు. ఐవీఆర్సీఎల్ ప్రతినిధులను ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో ఆ సంస్థ యాజమాన్యం మీడియా ముందుకు వచ్చింది. మీడియా ప్రశ్నల వర్షంతో ఒకానొక సందర్భంలో అసహనానికి గురైన యాజమాన్యం ప్రతినిధులు మీడియా ప్రతినిధులపై కేకలు వేశారు. ఈ ప్రమాదానికి చాలా కారణాలున్నాయని చెప్పిన యాజమాన్యం... అందులో తాము చేసిన జాప్యం కూడా ఒకటని చెప్పింది. అయితే తాము చేసిన జాప్యం కారణంగానే ప్రమాదం జరిగిందని తేల్చేయడం సరికాదని పేర్కొంది.