: ఇక ప్రతి శుక్రవారం వైఎస్ జగన్ కోర్టుకెళ్లరు!
‘ప్రతి శుక్రవారం కోర్టు మెట్లెక్కాల్సిన మీరా?... మాకు చెప్పేది’’ అంటూ ఏపీలో అధికార పార్టీ టీడీపీ నేతలు వైసీపీ అధినేత, విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడేందుకు ఇకపై అవకాశం లేదు. జగన్ పై విమర్శలు గుప్పించేందుకు వారు కొత్త వాక్యాన్ని సిద్ధం చేసుకోక తప్పని పరిస్థితి. ఎందుకంటే, నిన్న జగన్ కు కాస్తంత ఊరటనిస్తూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకెళితే... తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు వెనకేసుకున్నారన్న ఆరోపణలపై సీబీఐ జగన్ మీద 11 కేసులు పెట్టింది. ఆ కేసులకు సంబంధించి చార్జిషీట్లను కూడా కోర్టులో దాఖలు చేసింది. తాజాగా మొన్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా ఓ ఆర్థిక నేరాల కోర్టులో మరో చార్జిషీట్ ను దాఖలు చేసింది. సీబీఐ దాఖలు చేసిన 11 చార్జిషీట్లకు సంబంధించిన విచారణ ప్రస్తుతం హైదరాబాదు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ప్రతి శుక్రవారం జరుగుతోంది. ఈ విచారణకు జగన్ తో పాటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా తప్పనిసరిగా హాజరుకావాల్సిందేనని కోర్టు చెప్పింది. దీంతో ప్రతి శుక్రవారం కోర్టు మెట్లెక్కుతున్న జగన్ పై అధికార పక్షానికి చెందిన నేతలు వ్యంగ్యంతో విరుచుకుపడుతున్నారు. అయితే ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న తాను అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉన్నందున కోర్టు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. నిన్న దీనిపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇళంగో... జగన్ కు ఊరటనిస్తూ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చారు. ఇక దాల్మియా సిమెంట్స్ అధినేత పునీత్ దాల్మియాకు కూడా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించింది. ఈ నేపథ్యంలో ఇక వైఎస్ జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకెళ్లాల్సిన అవసరం లేదు.