: ఎన్నికల ఖర్చులకు కిందా, మీదా పడదాం!... అవినీతికి మాత్రం దూరంగా ఉండండి!: పార్టీ నేతలకు చంద్రబాబు ఉద్బోధ
అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. ఇక పార్టీ నేతల ప్రవర్తనపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు దృష్టి సారించారు. నిన్న హైదరాబాదులోని సచివాలయంలో పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సదరు భేటీ ముఖ్య ఉద్దేశాన్ని చంద్రబాబు సుతిమెత్తగానే అయినా... సూటిగా చెప్పేశారు. ఎన్నికల్లో నానాటికీ పెరిగిపోతున్న ఖర్చును ప్రస్తావించిన ఆయన... సదరు ఖర్చుకోసమంటూ అవినీతికి పాల్పడతామంటే కుదరదని కూడా ఆయన హెచ్చరించారు. అవినీతి మకిలిని చేతులకు అంటించుకునే నేతలను వదిలిపెట్టేది లేదని ఆయన తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎన్నికల్లో ఖర్చు పెరిగిపోయిన మాట నిజమే. కానీ అందుకోసం తప్పులు చేయవద్దు. పేదల్లో 75- 80 శాతం మందికి ప్రభుత్వపరంగా ఏదో ఒక లబ్ధి కలిగేలా యత్నిస్తున్నాం. ఎన్నికల్లో ఖర్చులకు ఏదోలా కిందా, మీదా పడదాం. అవినీతికి మాత్రం దూరంగా ఉండండి’’ అని ఆయన ఎమ్మెల్యేలకు సూచించారు.