: ఆనాడు నరకం చూపించారు...ఆ మచ్చలు చెరపగలరా?: అమితాబ్ సూటి ప్రశ్న


నరకం చూపించారంటూ బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు తన బ్లాగులో తన చేదు అనుభవాలను వివరించారు. 'టెక్నాలజీ పెరిగిపోయింది. ఆరోపణలు చేయడం సులభమైపోయింది. ఏది వాస్తవం? ఏది అవాస్తవం? అన్నది తెలుసుకోవాలన్న కోరిక ప్రజల్లో ఉండడం లేదు. దీంతో వివాదాస్పద ఆరోపణలను మోసుకెళ్లే వాహనాలు అత్యంత వేగంగా పరుగులు తీస్తున్నాయి' అని ఆయన అభిప్రాయపడ్డారు. ఎడారి ఇసుక తుపాను కంటే వేగంగా తీసుకెళ్లే కేబుళ్లు, శాటిలైట్లు వాటి పరిధిని మరింత పెంచుతున్నాయని ఆయన పేర్కొన్నారు. 25 ఏళ్ల క్రితం వెలుగు చూసిన బోఫోర్స్ కుంభకోణంలో దేశంలోని ప్రతి చేయీ తన కుటుంబాన్ని వేలెత్తి చూపిందని ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ నరకం పాతికేళ్లపాటు చూపించారని ఆయన వాపోయారు. ఎక్కడికెళ్లినా, ఏం చేసినా దానితోనే ముడిపెట్టి చూసేవారని, ఎన్నో ఆరోపణలు, ఇంకెన్నో విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కాగా, బోఫోర్స్ కుంభకోణంలో అమితాబ్ కుటుంబానికి ఎలాంటి పాత్ర లేదని ఆ కేసును విచారించిన స్వీడిష్ కంపెనీలు క్లీన్ చిట్ ఇచ్చాయి. అయినప్పటికీ ఆనాడు తమ కుటుంబం అనుభవించిన బాధను, అప్పుడంటిన మరకలను ఎవరు మాత్రం తొలగించగలరని ఆయన ప్రశ్నించారు. స్వీడిష్ విచారణ కంపెనీలు క్లీన్ చిట్ ఇచ్చిన తరువాత కూడా తమ కుటుంబాన్ని వదల్లేదని ఆయన గుర్తుచేసుకున్నారు. 'అప్పటికే చేదు పరిణామాలతో నరకం చూశాం. అయినా ఇంకా ఏ విధంగా స్పందిస్తాం?' అని ఆయన ప్రశ్నించారు. కాగా, జీవితంలో ఎన్ని ఆటుపోట్లను చూసినా అమితాబ్ చలించలేదు కనుకే దిగ్గజంగా నేటి తరానికి ఆదర్శంగా నిలిచారు.

  • Loading...

More Telugu News