: చరిత్ర సృష్టించిన కేసీఆర్!... చట్టసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తొలి ముఖ్యమంత్రిగా రికార్డు!
ఏళ్ల తరబడి కొనసాగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ లక్ష్యాన్ని సాధించిన వ్యక్తిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పటికే రికార్డులకెక్కారు. ఆ తర్వాత కొత్త రాష్ట్రం తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగానూ బాధ్యతలు చేపట్టిన ఆయన చరిత్ర పుటలకెక్కారు. ఇక తాజాగా దేశంలోని ఏ ఒక్క నేత చేయలేని పనిని కేసీఆర్ చేశారు. చట్టసభల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరిట సరికొత్త రీతిలో ప్రసంగించిన ఆయన కొత్త రికార్డు నెలకొల్పారు. అటు పార్లమెంటులోనే కాక ఇటు దేశంలోని ఏ ఒక్క నేత కూడా చట్టసభలో ఇప్పటిదాకా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన దాఖలా లేదు. హైటెక్ సీఎంగా పేరుగాంచిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కూడా ఈ దిశగా రికార్డు నెలకొల్పలేకపోయారు. తెలంగాణకు గతంలో జరిగిన అన్యాయం, ప్రస్తుతం కొత్త రాష్ట్రంలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను గుదిగుచ్చి కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా దాదాపు రెండు నెలల పాటు అధికారులు శ్రమించి రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను కేసీఆర్ సభలో వినిపించారు. కంప్యూటర్ పరిజ్ఞానంలో అసమాన ప్రతిభ గడించిన ఓ టెక్కీ స్థాయిలో కేసీఆర్ కంప్యూటర్ తెర ముందు కూర్చుని, మౌస్ చేతబట్టి ఆయా అంశాలను సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా వివరించారు. ఓ పక్క కంప్యూటర్ తెరపై ఆయా అంశాల ప్రస్తుత పరిస్థితిని చూపిస్తూ ఆ అంశాలకు ఉన్న ప్రాధాన్యతను తన వాక్చాతుర్యంతో కేసీఆర్ వివరించారు.