: ఐక్యరాజ్యసమితి విఫలమైంది: మోదీ
ఐక్యరాజ్య సమితిపై భారత ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని నిరోధించడంలో ఐక్యరాజ్యసమితి విఫలమైందని, ఈ విషయంలో సమగ్రమైన ప్రణాళికతో ముందుకు వెళ్లడం లేదని ఆయన అన్నారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి పదవి కోసం జరిగే ఎంపికను ఈసారి బహిరంగంగా నిర్వహించాలని ప్రపంచదేశాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఐక్యరాజ్యసమితి ఉన్నత పదవిపై ప్రపంచదేశాలు చర్చ చేపట్టాలనుకుంటున్నాయి. ఉగ్రవాదం విషయంలో ఐక్యరాజ్యసమితి తన బాధ్యతలను సంపూర్ణంగా నిర్వహించలేకపోయిందని మోదీ విమర్శించారు. బ్రస్సెల్స్‌లో భారతీయ సంతతి ప్రజలతో నిన్న మోదీ మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఉగ్రవాదంపై పోరు పట్ల ఐక్యరాజ్యసమితి ఇప్పటివరకు సరైన తీర్మానంతో ముందుకు రాలేదని అన్నారు. మోదీ తన విదేశీ పర్యటనలో భాగంగా నిన్న బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో పర్యటించారు. అనంతరం అక్కడి నుంచి వాషింగ్టన్ చేరుకున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అణుభద్రతపై జరగనున్న నాలుగో శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు.