: నా భర్త కిడ్నాప్ వెనుక ‘తలసాని’ కొడుకు పాత్ర ఉంది: అరకు ఎంపీ గీత
హైదరాబాద్ లోని 5 ఎకరాల భూమికి సంబంధించిన వివాదంలో తన భర్త రామకోటేశ్వరరావును చర్చలకు పిలిచి టీఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి యాదవ్ కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడని అరకు ఎంపీ గీత భర్త ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాదు జర్నలిస్టు కాలనీలోని తమ ఇంటి నుంచి నిన్న సాయంత్రం తన భర్త రామకోటేశ్వరరావు బయటకు వెళ్లారని, వ్యాపార లావాదేవీల నిమిత్తం ఒక నిర్మాణ సంస్థ కు చెందిన వ్యక్తులు ఆయన్ని కారులో ఒక హోటల్ కు తీసుకువెళ్లారని చెప్పారు. భూ వ్యవహారంపై అక్కడ చర్చలు జరుగుతున్న సమయంలో తన భర్తకు ఫోన్ చేసేందుకు ప్రయత్నించానని, రెండు గంటల పాటు ఆయన మొబైల్ స్పందించలేదని, వెంటనే, తన భర్త కారు డ్రైవర్ కు ఫోన్ చేశానని, అక్కడున్న కొందరు వ్యక్తులు తన భర్తను ఇబ్బంది పెడుతున్నట్లు తనకు చెప్పాడని గీత పేర్కొంది. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. నిన్న అర్ధరాత్రి తన భర్తను కిడ్నాపర్లు కొండాపూర్ లో వదిలేసిన తర్వాత ఆయన తనకు ఫోన్ చేశారని తెలిపారు. గచ్చిబౌలిలో తమకు 5 ఎకరాల భూమి ఉందని, దాని విలు సుమారు రూ.75 కోట్లు ఉంటుందని, దానిని అభివృద్ధి చేసే నిమిత్తం రామకృష్ణ, సుధాకర్ రావు అనే వ్యక్తులకు సంబంధించిన నిర్మాణ సంస్థకు ఇచ్చినట్లు చెప్పారు. ఎన్ని నెలలు గడుస్తున్నా ఆ భూమిని అభివృద్ధి చేయలేదన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తమ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నామని అన్నారు. దీంతో, ఈ భూమిని సొంతం చేసుకునేందుకు రామకృష్ణ, సుధాకర్ తో పాటు మరికొందరు వ్యక్తులు తన భర్తను కిడ్నాప్ చేశారని, దీని వెనుక మంత్రి తలసాని కొడుకు సాయి యాదవ్ పాత్ర ఉందని గీత ఆరోపించారు.