: కృష్ణా, గోదావరి నదుల్లో నేను వేసినన్ని నాణేలు ఎవరూ వేసి ఉండరు: కేసీఆర్


అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సందర్భంగా టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. ఉద్యమ సమయంలో తెలంగాణ మీదుగా ప్రవహిస్తున్న కృష్ణా, గోదావరి నదుల్లో తాను వేసినన్ని నాణేలు ఎవరూ వేసి ఉండరని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని వెల్లడించిన సందర్భంగా నాటి తన దినచర్యను ఆయన ఆసక్తికరంగా చెప్పారు. సిద్దిపేటకు చెందిన బాలయ్య అనే వ్యక్తి తనకు మొదటి నుంచి డ్రైవర్ గా పనిచేస్తున్నాడని ఆయన చెప్పారు. దాదాపుగా 35 ఏళ్లుగా బాలయ్యే తనకు డ్రైవర్ గా ఉన్నాడన్నారు. ఈ క్రమంలో కృష్ణా, గోదావరి నదులను దాటే తన పర్యటనలకు ముందు బాలయ్య ఓ పది రూపాయల నాణేలను జేబులో వేసుకుని వచ్చేవాడన్నారు. నదీమ తల్లులను దాటేటప్పుడు అక్కడ ఆగడం, నదీ ప్రవాహంలో నాణెం వేయడం తమ సంస్కృతి అని చెప్పిన కేసీఆర్... ఉద్యమ సమయంలో తాను తుచ తప్పక పాటించానని చెప్పారు. నదులు దాటేటప్పుడు బాలయ్యే తన జేబులోని నాణేలను తీసి ఇచ్చేవాడన్నారు. ఈ క్రమంలో ఆ రెండు నదుల్లో తాను వేసినన్ని నాణేలను మరెవరూ వేసి ఉండకపోవచ్చని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో తమ బీడు భూములను ఎప్పుడు తడుపుతారని ఆ నదీమ తల్లులను మనసారా వేడుకునేవాడినన్నారు. ఈ క్రమంలోనే ఆ నదీమ తల్లుల దీవెనలు, ప్రజల ఆకాంక్షలు నెరవేరుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News