: నా కొడుకు బెదిరించాడన్న ఆరోపణలు అవాస్తవం: ఎంపీ భర్త కిడ్నాప్ పై తలసాని వివరణ


విశాఖ జిల్లా అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్త పరుచూరి రామకోటేశ్వరరావును తన కొడుకు బెదిరించాడన్న ఆరోపణలపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్పందించారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని తన నివాసంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ తలసాని ఈ వ్యవహారంపై సమగ్ర వివరణ ఇచ్చారు. పలు వ్యాపారాల పేరిట తమ వద్ద రామకోటేశ్వరరావు 2011లో రూ.13 కోట్లు అప్పుగా తీసుకున్నారని తలసాని చెప్పారు. ఆ మొత్తం చెల్లింపు విషయంలో రామకోటేశ్వరరావు ఎప్పటికప్పుడు వాయిదాలు పెడుతూ వచ్చారన్నారు. అయితే తమకు కూడా వ్యాపార భాగస్వాముల నుంచి డబ్బుల కోసం ఒత్తిడులు ఎదురయ్యాయని చెప్పారు. ఈ క్రమంలో డబ్బుల విషయంలో నిన్న తన కొడుకు రామకోటేశ్వరరావుతో మాట్లాడిన విషయం వాస్తవమేనన్నారు. తాజ్ కృష్ణ హోటల్ లో జరిగిన ఈ చర్చల్లో డబ్బులడగిన తన కొడుకుతో తన పేరిట ఉన్న ఐదెకరాల భూమి పత్రాలను హామీగా పెడతానని రామకోటేశ్వరరావే స్వయంగా చెప్పారన్నారు. ఈ క్రమంలో మళ్లీ ఇంటికి వెళ్లి సదరు భూమి పత్రాలు తెచ్చి రామకోటేశ్వరరావే స్వయంగా తన కొడుక్కు ఇచ్చారని, ఈ సందర్భంగా ఓ కాగితంపై సదరు పత్రాలు ఇస్తున్నట్లు రాసిచ్చారన్నారు. ఆ తర్వాత అందరూ అక్కడి నుంచి నవ్వుతూనే వెళ్లిపోయారన్నారు. అయితే ఆ తర్వాత తమ వద్ద తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వకుండా ఉండేందుకు రామకోటేశ్వరరావు పన్నాగం పన్ని కిడ్నాప్, బెదిరింపుల ఆరోపణలు చేశారన్నారు. దీంతో రామకోటేశ్వరరావు వద్ద తీసుకున్న పత్రాలను తాము పోలీసులకు అందజేశామని తెలిపారు. ఇప్పటికే పలు బ్యాంకుల అధికారులను మోసం చేసిన రామకోటేశ్వరరావు తమను కూడా మోసం చేయాలని చూస్తున్నారని తలసాని ఆరోపించారు. అయితే తమను మోసం చేయడం రామకోటేశ్వరరావుకు సాధ్యం కాదన్నారు. తామిచ్చిన డబ్బులు ఎలా రాబట్టుకోవాలో తమకు తెలుసన్నారు. అయినా హోటల్ లాన్ లో కూర్చుని బెదిరించడం సాధ్యమేనా? అని కూడా తలసాని మీడియాను ప్రశ్నించారు. ఈ వ్యవహారానికి సంబందించి రేపు మధ్యాహ్నం పూర్తి వివరాలు, ఆధారాలతో మరోమారు మీడియా ముందుకు వస్తానని ఆయన చెప్పారు. ఈలోగా ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసి తన కొడుకు తప్పుంటే చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించానని కూడా తలసాని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News