: కిడ్నాప్ జరగలేదు!... వాగ్వాదమే జరిగిందని చెప్పారు: వెస్ట్ జోన్ డీసీపీ
విశాఖ జిల్లా అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్త పరుచూరి రామకోటేశ్వరరావుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కుమారుడు సాయి యాదవ్ దౌర్జన్యానికి దిగాడన్న విషయంపై తమకు సమాచారం అందిందని పంజాగుట్ట వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు చెప్పారు. రామకోటేశ్వరరావు కిడ్నాప్ అయ్యారంటూ కొత్తపల్లి గీత మీడియాకు సమాచారం అందించడం, పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేయడం కలకలం రేపింది. ఈ క్రమంలో అర్ధరాత్రి దాటిన తర్వాత తాను క్షేమంగానే ఉన్నానంటూ రామకోటేశ్వరరావు తన భార్య గీతకు ఫోన్ చేయడంతో కిడ్నాప్ కథ సుఖాంతమైందని అంతా భావించారు. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు కొత్తపల్లి గీత ఇంటికి వెళ్లారు. రామకోటేశ్వరరావుతో మాట్లాడారు. ఆ తర్వాత బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ... రామకోటేశ్వరరావు కిడ్నాప్ కాలేదని చెప్పారు. అయితే తనతో రామకృష్ణ, తలసాని కుమారుడు సాయి వాగ్వాదానికి దిగారని రామకోటేశ్వరరావు చెప్పారన్నారు. అంతేకాక తన నుంచి ఓ డాక్యుమెంట్ ను సాయి యాదవ్ లాక్కున్నారని రామకోటేశ్వరరావు చెప్పారన్నారు. దీనిపై తమకు ఇంకా లిఖితపూర్వక ఫిర్యాదు అందలేదని, తానే స్వయంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేస్తానని రామకోటేశ్వరరావు చెప్పారన్నారు. ఫిర్యాదు అందిన తర్వాత దానికనుగుణంగా చర్యలు చేపడతామని డీసీపీ పేర్కొన్నారు.