: నాకూ మైక్ దొరకట్లేదు!... నేనెవర్ని అడగాలి?: ఏపీ శాసనమండలిలో చైర్మన్ సరదా కామెంట్
సాధారణంగా చట్ట సభల్లో అధికార పక్ష సభ్యులకు మైక్ లభించని పరిస్థితి అంటూ ఉండదు. విపక్ష సభ్యులకు మైక్ దొరికినా, వారు కోరుకున్నంత సేపు మాట్లాడే వీలు చిక్కదు. ఇక అటు విపక్ష సభ్యులతో పాటు అధికార పార్టీ సభ్యులకు కూడా మైక్ ఇచ్చేది మాత్రం సభాపతే. ఈ క్రమంలో సభాపతికి మైక్ దొరకకపోవడమనే సమస్యే రాదు. అలాంటిది ఏపీ శాసనమండలి సభాధ్యక్ష స్థానంలో ఉన్న చైర్మన్ చక్రపాణి నిన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సరదాగానే ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి. నిన్నటి సమావేశాల్లో భాగంగా మండలికి వచ్చిన సీఎం నారా చంద్రబాబునాయుడు ఉన్నత విద్యపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఆ తర్వాత చైర్మన్ అనుమతి లేకుండానే అటు అధికార, ఇటు విపక్ష సభ్యులు తమ తమ అభిప్రాయాలను సీఎంకు చెప్పారు. చైర్మన్ మైకివ్వకున్నా సభ్యులు లేచి మాట్లాడటం, దానికి సీఎం చంద్రబాబు సమాధానాలు చెప్పుకుంటూ పోవడం కనిపించింది. ఈ క్రమంలో చక్రపాణి కల్పించుకుని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నాకూ మైక్ కావాలి. నాకు అవకాశం రావడం లేదు. నాకొక అవకాశం ఇస్తే మాట్లాడాలనుకుంటున్నా. కానీ, ఒకరి తర్వాత ఒకరు మీరే మాట్లాడుతున్నారు’’ అని ఆయన అన్నారు. దీంతో సభలో సభ్యులంతా ఒక్కసారిగా నవ్వేశారు.