: విజయవాడలో గుండెలు తీసిన బంటు... అప్పిచ్చిన మహిళను లొంగదీసుకుని వేధింపులు!


మానవ సంబంధాల్లో పలు కోణాలు వివిధ నేరాలకు కారణమవుతుంటాయి. అలాంటి ఘటనే విజయవాడలో చోటుచేసుకుంది. సింగ్ నగర్ పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే... కృష్ణలంక ప్రాంతానికి చెందిన రవికాంత్ తో ఓ మహిళకు వివాహం జరిగింది. అనంతరం అతను ఆమె సోదరి శ్రీదేవిని రెండో వివాహం చేసుకుని ఆమెతో అయోధ్యనగర్ లోని రామలింగేశ్వరపేటలో కాపురం పెట్టాడు. ఆ ఇంటిపక్కనే నివాసం ఉంటున్న మహిళతో ఈ దంపతులు పరిచయం పెంచుకున్నారు. ఆమె భర్తకు విడాకులిచ్చి దూరంగా ఉంటున్న సంగతి గ్రహించిన రవికాంత్, భార్య సహకారంతో ఆమెతో సంబంధం పెట్టుకుని మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆమె నుంచి 6 లక్షల రూపాయలు అప్పుచేశాడు. తీసుకున్న డబ్బులు చెల్లించాలని ఆమె డిమాండ్ చేయడంతో తామిద్దరూ ఏకాంతంగా గడిపిన వీడియోలు, ఫోటోలు బయటపెడతానని బెదిరించడం మొదలు పెట్టాడు. అంతే కాకుండా ఇంకా ఎక్కువ మాట్లాడితే, ఆమె పిల్లలను హత్య చేస్తానంటూ బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు, రవికాంత్ ను అదుపులోకి తీసుకున్నారు. అతని భార్య కోసం గాలింపు చేపట్టారు. బాధితురాలు మాట్లాడుతూ, శ్రీదేవి తనతో స్నేహంగా ఉండి. తన ఫోటోలు తీసి భర్తకు ఇచ్చిందని, అప్పటి నుంచి అతను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడని తెలిపారు. తాను లొంగిపోయిన తరువాత మరిన్ని వీడియోలు తీశారని, అలా తీసినప్పుడు నవ్వుతూ ఉండాలని భయపెట్టేవారని, నవ్వకపోతే నరకం చూపించేవారని, కన్నీళ్లు దిగమింగి వారు చెప్పినట్టు చేసే దానినని ఆమె చెప్పింది. ఈ వీడియోలు తన బంధువులకు చూపించారని, ఆ వీడియోలు చూసినవారంతా తప్పుతనదే అని చెప్పేవారని ఆమె తెలిపింది.

  • Loading...

More Telugu News