: సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న చైనా టీచర్ నిర్వాకం
సామాజిక మాధ్యమాల విస్తృతితో ప్రపంచంలో ఏ మూల ఏ సంఘటన జరిగినా క్షణాల్లో అది ప్రపంచానికి తెలిసిపోతోంది. తాజాగా చైనాలో చోటుచేసుకున్న సంఘటన సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ...పాఠశాలల్లోని టీచర్ల నైతిక ప్రవర్తనపై హెచ్చరికలు జారీ చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే... చైనాలోని లింగ్షాన్ కౌంటీలోని ఓ స్కూల్ లో హూ అనే టీచర్ స్కూలులో ఓ విద్యార్థినిపై అత్యాచారయత్నం చేశాడు. స్కూల్ ఆవరణలో అందరి ముందు నగ్నంగా మారిన సదరు టీచర్ ఓ విద్యార్థినిని తీసుకుని తరగతి గదిలోకి లాక్కెళ్లి అత్యాచారయత్నం చేయడంతో పరిస్థితి గమనించిన మరో టీచర్ ఇతర ఉపాధ్యాయులను అప్రమత్తం చేసి, యువతిపై అఘాయిత్యం జరగకుండా కాపాడారు. ఆ టీచర్ 2011లో మానసిక రుగ్మతకు గురయ్యాడని, చికిత్స తీసుకోవడంతో రెండేళ్ల తరువాత అతనిని విధుల్లోకి తీసుకున్నారని, అయితే టీచింగ్ బాధ్యతలు అప్పగించకుండా లైబ్రరీకి పరిమితం చేశారని స్కూలు తెలిపింది. లైబ్రరీలో విధులు సక్రమంగా నిర్వర్తించడంతో అతని మానసిక రుగ్మత నయమైందని భావించిన స్కూల్ యాజమాన్యం అతనిని బోధనకు అనుమతించింది. దీంతో ఆయన మరోసారి మానసిక చంచలత్వంతో స్కూల్ లోనే బాలికపై అత్యాచారయత్నం చేయడం కలకలం రేపింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.