: జీతాల పెంపు బిల్లును వ్యతిరేకిస్తున్నా...ఇదే నా సవాలు: వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాలు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును వైఎస్సార్సీపీ సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యతిరేకించారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం, ప్రతిపక్షం కలసి తీసుకున్న నిర్ణయాన్ని తన అంతరాత్మ ప్రభోదాన్ని అనుసరించి, దీనిని తాను వ్యతిరేకిస్తున్నానని అన్నారు. 'ఒకవైపు రాష్ట్రంలో నిధులు లేవని చెబుతారు, ప్రజలు సహకరించాలని చెబుతారు. అంటే ప్రజలు త్యాగాలు చెయ్యాలి, రాష్ట్రాన్ని పాలించే వారు త్యాగాలు చేయరా?' అని ఆయన సూటిగా అడిగారు. టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రభుత్వానికి నచ్చిన ఏదో ఒక నియోజకవర్గంలో ప్రజాప్రతినిధుల జీతాల పెంపుపై రెఫరెండం చేపట్టాలని ఆయన సూచించారు. అక్కడ దీనికి అనుకూలంగా ప్రజలు ఓటేస్తే...తక్షణం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన సవాలు విసిరారు. ప్రజావ్యతిరేక విధానాలు సరికాదని ఆయన సూచించారు. ప్రజాప్రతినిధులు జీతాలమీద ఆధారపడే బతుకుతున్నారా? అని ఆయన నిలదీశారు. జీతాల పెంపును అంతా సమర్థిస్తున్నప్పటికీ తాను వ్యతిరేకిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.