: ‘శామ్ సంగ్’పై సాకర్ దిగ్గజం పీలే దావా
ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ శామ్ సంగ్ తమ ప్రకటనలో తనను పోలిన ఒక ఫొటోను వాడుకుందని, అందుకు తన అనుమతి తీసుకోలేదని బ్రెజిల్ సాకర్ దిగ్గజం ఆరోపించారు. ఈ మేరకు సదరు సంస్థపై దావా వేశాడు. శామ్ సంగ్ సంస్థపై 30 మిలియన్ డాలర్లకు ఈ దావా వేశాడు. గత ఏడాది అక్టోబర్ లో శామ్ సంగ్ తన కొత్త మోడల్ టీవీలపై ఒక ప్రకటన ప్రచురించింది. ఈ ప్రకటనలో పీలే లా కన్నించే ఒక వ్యక్తి ఫొటోతో పాటు, సిజర్స్ కిక్ ఆడుతున్న ఒక ఫుట్ బాల్ క్రీడాకారుడి చిన్న సైజు ఫొటోను ప్రచురించింది. సిజర్స్ కిక్ అనేది పీలే ప్రత్యేకతగా చెబుతారు. ఈ ప్రకటనకు సంబంధించి పీలే నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదని ఆయన తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఈ నెల 16న ఈ కేసు పెట్టినట్లు చెప్పారు. కాగా, ఈ విషయమై స్పందించేందుకు శామ్ సంగ్ ఎలక్ట్రానిక్స్ సంస్థ ప్రతినిధులు నిరాకరించారు.