: ఏడాదిలో 40 శాతం మహిళలపై లైంగిక వేధింపులు.. అధ్యయనంలో వెల్లడి
నిర్భయ లాంటి ఎన్ని చట్టాలొచ్చినా.. మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ప్రతిరోజూ స్త్రీలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశరాజధాని ఢిల్లీలో ఇలాంటి వరస ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ విషయమే మరోసారి ‘ఇంటర్నేషనల్ క్రిమినల్ జస్టిస్ రివ్యూ’ అధ్యయనంలో వెల్లడైంది. ఢిల్లీలో ఏడాదిలో 40 శాతం మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని అధ్యయనంలో తేలింది. నగరంలోని బస్సులు, పార్కుల వంటి బహిరంగ ప్రదేశాల్లోనే గత సంవత్సర కాలంలో 40 శాతం మంది మహిళలు లైంగిక వేధింపులకు గురయ్యారని అధ్యయనం తెలిపింది. ఈ వేధింపులు పట్టపగలే ఎక్కువ చోటుచేసుకుంటున్నాయని వెల్లడించింది. కఠిన చట్టాలను రూపొందించినప్పటికీ పరిస్థితుల్లో మాత్రం మార్పు రాలేదని, రాజధాని నగరంలోని మహిళల్లో అభద్రతా భావం ఇంకా తగ్గలేదని అధ్యయనం పేర్కొంది. చాలా మంది మహిళలు వేధింపుల భయంతో నలుగురిలోకి వెళ్లడమే మానేశారని చెప్పింది. మరికొందరు మహిళలు తమ ఉద్యోగాలు వదిలేశారని నివేదిక పేర్కొంది. ప్రపంచమంతటా మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నప్పటికీ భారత్‌తో పాటు ఇతర దక్షిణాసియా దేశాల్లో ఈ సమస్య అధికంగా ఉందని పరిశోధకులు వెల్లడించారు. సామాజిక వ్యవస్థలో స్త్రీల పాత్ర ఎంతో ముఖ్యమైంది. సమాజ గమనంలో, ఆధునిక తరాల అభివృద్ధి క్రమంలో మహిళల తోడ్పాటు ఎంతో గణనీయమైంది. అయితే, ఈ వేధింపుల పర్వం దేశ రాజధానిలోనే ఇంత తీవ్రంగా ఉండడం ఆందోళన కలిగించే విషయం.