: సెల్ఫీ క్రేజ్: ఈజిప్టు విమానాన్ని హైజాక్ చేసిన దుండగుడితో సెల్ఫీ దిగిన ప్రయాణికుడు
సెల్ఫీ క్రేజ్.. ఇదే స్మార్ట్ ఫోన్ యూజర్లను వెర్రివాళ్లను చేస్తుంది. తమకు నచ్చిన ప్రాంతంలో, తెలియని వ్యక్తులతో విభిన్న ప్రదేశాల్లో సెల్ఫీలు తీసుకోవాలని తాపత్రయ పడుతున్నారు. ఒక్కోసారి ఈ క్రేజే శృతిమించుతోంది. ఎవరి వెర్రి వారికానందం కదా.. అందుకే ఏకంగా ఈజిప్టు విమానాన్ని హైజాక్ చేసిన దుండగుడితో కలిసి ఓ వ్యక్తి సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అలెగ్జాండ్రియా నుంచి కైరో వస్తున్న ఈజిప్ట్ విమానాన్ని నిన్న ఓ దుండగుడు హైజాక్ చేసిన విషయం తెలిసిందే. విమానం హైజాక్ కావడం తీవ్ర అలజడి సృష్టించింది. అయితే, విమాన హైజాక్‌తో అందరూ బెదిరిపోతుంటే ఆ సమయంలో బందీగా ఉన్న బ్రిటన్‌కు చెందిన బెంజిమిన్ ఇన్స్ అనే యువ ప్రయాణికుడు.. హైజాకర్ దగ్గరకు వెళ్లి సెల్ఫీకి పోజివ్వమన్నాడు. నడుముకు బాంబులు చుట్టుకున్న హైజాకర్‌తో కలిసి సెల్ఫీ తీసుకుని.. దాన్ని ట్విట్టర్ ద్వారా స్నేహితులకు పంపాడు. 'ఆ ఫొటోలో బెంజిమిన్ నవ్వుతూ కన్పించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసే విషయమే'.. అని నెటిజన్లు అంటున్నారు. నిన్న హైజాక్ చేసిన విమానం సైప్రస్ లో ల్యాండవగానే, తన డిమాండ్ నెరవేరేదాకా ప్రయాణికులను వదిలేది లేదని చెప్పిన హైజాకర్ ఇబ్రహీం సమాహా, ఆ తర్వాత ఐదుగురు విదేశీ ప్రయాణికులు, విమాన సిబ్బందిని బందీలుగా పెట్టుకుని మిగిలిన వారందరినీ వదిలి పెట్టేశాడు. తన భార్యను తీసుకువచ్చి అప్పజెప్పి, సైప్రస్ లో తనకు భద్రత కల్పించాలంటూ డిమాండ్ చేశాడు. ఆ తరువాత అధికారులు జరిపిన సంప్రదింపులతో బందీలను విడుదల చేశాడు. అనంతరం చాకచక్యంగా విమానంలోకి ప్రవేశించిన భద్రతాధికారులు సమాహాను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.