: ఎస్డీఎఫ్ పై ధ్వజమెత్తిన వైసీపీ... సెల్ఫ్ డిఫెన్స్ లో టీడీపీ సర్కారు
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా చివరి రోజు సమావేశాల్లో మరోమారు వేడి రాజుకుంది. ప్రత్యేక అభివృద్ది నిధి (స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్- ఎస్డీఎఫ్) పేరిట టీడీపీ సర్కారు తెరపైకి తెచ్చిన సరికొత్త నిధులపై వైసీపీ ముప్పేట దాడి చేసింది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలను పక్కనబెట్టి, ఓటమిపాలైన టీడీపీ అభ్యర్థులు, అసలు బరిలోకి దిగని ఆ పార్టీ నేతలను ఆయా నియోజకవర్గాలకు ఇన్ చార్జీలుగా నియమించిన ప్రభుత్వం వారికి రూ.50 లక్షల చొప్పున నిధులను కేటాయించి అభివృద్ధి పనులు చేయాలని సూచించింది. ఈ మేరకు పక్కాగా అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీనిపై విపక్షం భగ్గుమంది. గెలిచిన అభ్యర్థులకు కాకుండా ఓడిన అభ్యర్థులకు నిధులెలా ఇస్తారని ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇష్టమొచ్చిన వారికి అభివృద్ధి నిధులిస్తే, ఇక ఆయా నియోజకవర్గాల నుంచి గెలిచిన తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. ఈ సందర్భంగా వైసీపీ సభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తి ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. అధికార పార్టీ సభ్యుల నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలకు నిధులిచ్చి, విపక్ష సభ్యుల నియోజకవర్గాలకు ఇన్ చార్జీలను నియమించడమేమిటని ఆయన విరుచుకుపడ్డారు. ఆ తర్వాత అందుకున్న విపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరును తూర్పారబట్టారు. దీంతో స్పందించిన ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు... సీఎం విచక్షణాధికారం కింద ఆయా నియోజకవర్గాలకు ఇన్ చార్జీలను నియమిస్తే తప్పేమిటని ఎదురు దాడికి దిగారు. అదే సమయంలో నియోజకవర్గాల పేర్లు, ఇన్ చార్జీల పేర్లను చదువుతున్న జగన్ మైక్ ను స్పీకర్ కోడెల శివప్రసాద్ కట్ చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విపక్షం... ప్రభుత్వ వాదనను తప్పుబడుతూ నిరసనకు దిగింది. స్పీకర్ పోడియంను చుట్టుముట్టింది. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో సభను స్పీకర్ 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.